జిల్లాకు ప్రభుత్వ పరిపాలన పరంగా కలెక్టర్ బాస్. ఆయనకు పాలనాధికారాలతో పాటు న్యాయాధికారాలు ఉంటాయి. అయితే కలెక్టర్లు రాజకీయ నాయకుల్లాగా నిత్యం మీడియా ముందుకు రారు. వాళ్ల పని వారు సైలెంట్ గా చేసుకుపోతుంటారు. ఏ వీఐపీలు వచ్చినప్పుడో వారి వెంట ఉంటే.. మీడియా గొట్టాలు ముందు పెడితే ఏదో నాలుగు మాటలు మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఏపీలో ఓ వింత పరిస్థితి నెలకొంది.

 

ఇప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అందుకు కారణం.. చంద్రబాబు అనుకూల పత్రికలు చేస్తున్న ప్రచారం. అసలు విషయం ఏంటంటే.. జగన్ సర్కారు ఉగాది నాటికి ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వారు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలు సేకరించి పంపిణీకి రెడీ చేస్తున్నారు.

 

అయితే కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుని అనుభవిస్తుండటం సాధారణం. అలాంటివారు ఈ భూసేకరణను అడ్డుకుంటున్నారు. తమకు ఆ భూమే జీవనాధారమని తమ పొట్టకొట్టొద్దని అంటున్నారు. ఇక ఈ ఆందోళనలు జగన్ వ్యతిరేక మీడియాకు వరంగా మారాయి. అంతే జగన్ సర్కారు పేదల భూములు లాక్కుంటోందని ప్రచారం మొదలు పెట్టేశాయి.

 

ఇక ఇలాంటి ఘటనలు అన్నింటినీ జోడించి కథనాలు వండి వార్చడం మొదలు పెట్టాయి. దీంతో జగన్ సర్కారు నష్ట నివారణకు పూనుకుంది. అసలు ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ భూసేకరణ వివరాలు వివరిస్తున్నారు. తప్పుడు కథనాలు ఇవ్వొద్దని చెబుతున్నారు. తమ వాదన కూడా మీడియాలో వినిపించాలని కోరుతున్నారు. అయితే ఈ కలెక్టర్ల ఆవేదనను సాక్షి మీడియా తప్ప జగన్ వ్యతిరేక మీడియాలు పట్టించుకోవడం లేదు. వారు తమ పాత పంథాలోనే జగన్ సర్కారు పేదల భూమలు లాక్కొంటుందన్న ప్రచారమే చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: