ఏపీలో అధికార వైసీపీలో రాజ్య‌స‌భ సీట్ల సెగ‌లు రాజుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో రెండు సీట్ల‌కు, ఏపీలో నాలుగు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిగే రెండు సీట్లు అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. అలాగే ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగే నాలుగు సీట్లు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. తెలంగాణ‌లో రెండు సీట్ల‌కు క‌విత‌, కేకే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి.



ఇక ఏపీలో నాలుగు సీట్ల‌కు పోటీ ఎక్కువ‌గానే ఉంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌న్ మండ‌లి ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో మండలిలో ఎమ్మెల్సీ అవ్వాల‌ని క‌ల‌లు క‌న్న వారంతా ఇప్పుడు ఏకంగా రాజ్య‌స‌భ‌కు గురి పెట్టి కూర్చున్నారు. అయితే ఇదే ఇప్పుడు వైసీపీలో చిచ్చుకు కార‌ణ‌మ‌వుతోంది. రాజ్య‌సభ స్థానాలు అన్ని ఒకే జిల్లాకు వెళ్లిపోతున్నాయ‌న్న అసంతృప్తి పార్టీ వ‌ర్గాల్లో ఉంది. ఇప్ప‌టికే తొలి రెండు రాజ్య‌సభ స్తానాలు నెల్లూరు జిల్లాకు వెళ్లిపోగా ఇప్పుడు మూడో సీటు కూడా అదే జిల్లాకు వెళ్లిపోవ‌డం దాదాపు ఖ‌రారైంది.



పార్టీ త‌ర‌పున తొలి సారి రాజ్య‌స‌భ‌లోకి ఎంటరైంది.. వి.విజ‌యసాయిరెడ్డి. ఈయ‌న‌కు వైఎస్ కుటుంబంతో ఉన్న బంధం ఏమిటో వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత పార్టీకి ల‌భించిన రెండో రాజ్య‌స‌భ సీటు కూడా నెల్లూరు రెడ్డిగారికే ద‌క్క‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఆయ‌న పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు భారీ ఎత్తున ఫండింగ్ ఇచ్చి మ‌రీ రాజ్య‌సభ సీటు ద‌క్కించుకున్నార‌న్న టాక్ ఉంది.



ఇక ఇప్పుడు మూడో రాజ్య‌స‌భ సీటు కూడా అదే జిల్లాకు వెళ్లిపోనుంది. ఈ సారి బీసీ కోటాలో బీద మ‌స్తాన్ రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ల‌భిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక వైసీపీలో చేరిక వెన‌క ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న టాక్ ఉంది. ఇలా అన్ని రాజ్య‌స‌భ స్థానాలు ఒకే జిల్లాకు వెళ్లిపోవ‌డంతో పాటు మ‌రో వైపు ఇటు మండ‌లి ర‌ద్ద‌వుతోన్న నేప‌థ్యంలో ప‌ద‌వులు ఆశించిన వారంతా జ‌గ‌న్‌పై గుస్సాతో ఉన్న‌ట్టు టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: