2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో రెండోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం, ఇటు ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీ ఎక్కడా ఆగలేదు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా..అసలు తగ్గకుండా ఆపరేషన్ కమలం మొదలుపెట్టింది. అప్పుడే జగన్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉండటంతో, బీజేపీ టీడీపీ నేతలని లాగేసుకునే పనిలో బిజీ అయింది.

 

టీడీపీ రాజ్యసభ సభ్యుల నుంచి సీనియర్, జూనియర్, మాజీ ఎమ్మెల్యేలు ఇలా వరుస పెట్టి నాయకులని పార్టీలో చేర్చుకుంది. అటు టీడీపీ వాళ్ళు కూడా అధికారం కోల్పోవడంతో భయపడి కాషాయ కండువా కప్పేసుకున్నారు. ఇలా ఓ మూడు నెలలు వరకు హడావిడి చేశారు. అదే ఊపులో అవసరమైతే వైసీపీ నేతలని కూడా చేర్చుకుంటామని, చాలామంది తమకు టచ్‌లో ఉన్నారని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు.

 

ఈ ప్రకటనలు ఎప్పుడు చేశారో...అప్పటి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. జగన్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో టీడీపీ, జనసేన నేతలు వరుసపెట్టి వైసీపీలోకి రావడం మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు జగన్‌కు జై కొట్టారు. మాజీ నేతలు, సీనియర్ నేతలు ఫ్యాన్ కిందకు వచ్చారు. ఇక ఈ వలసలు కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కూడా పలువురు టీడీపీ నేతలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

 

అయితే వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్న, బీజేపీలో మాత్రం అలాంటి కార్యక్రమం ఏమి జరగడం లేదు. ఒక్క నేత కూడా కాషాయ కండువా కప్పుకోవడం లేదు. జగన్ దెబ్బకు బీజేపీ వైపు చూసే నేతే కరువైపోయారు. పైగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసపెట్టి ఓడిపోతుంది. దీంతో ఏపీలోని నేతలు బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు బీజేపీలోకి వెళ్ళడం వల్ల పావలా ఉపయోగం లేదని భావిస్తున్నారు. అదే వైసీపీలోకి వెళితే మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నారు. మొత్తానికైతే జగన్ దెబ్బకు బీజేపీలోకి వలసలు ఆగిపోయాయనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: