అందితే జుట్టు...అందకుంటే కాళ్లు పట్టుకోవడం సామెత ఇప్పుడు పొదలకూరు రెవెన్యూ సిబ్బందికి సరిగ్గా సరిపోతుంది. పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిందే అని బెదిరిస్తారు. లంచం ఇచ్చిన వారు తిరగబడితే వాళ్ల కాళ్లు పట్టుకుంటారు. ఇక్కడి రెవెన్యూ సిబ్బందికిది షరామాములైపోయింది. వీళ్లు ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తారు. తమ రూటే సపరేటు అంటూ అవినీతిలో దూసుకెళ్తున్నారు. 

 

నెల్లూరు జిల్లా పొదలకూరు తహశీల్దారు కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇక్కడ బయటపడిన ఓ వాయిస్ కాల్ రికార్డింగ్ దుమారం రేపుతోంది. ఈ వాయిస్ రికార్డింగ్‌తో తహసీల్దారు కార్యాలయంలో కింది స్ధాయి ఉద్యోగులు, సిబ్బంది చేతివాటం బట్టబయలైంది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుని కింది స్ధాయి సిబ్బంది జలగల్లా రైతుల రక్తం తాగుతున్నారు. ఈ విషయం అంతా బాధిత రైతు రికార్డింగ్ చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరలైంది. సోషల్ మీడియాలో వచ్చిన రెవెన్యూ కాల్ రికార్డింగ్ విని  జనాలు నోరెళ్లబెడుతున్నారు. పొదలకూరు మండలం ఉలవరపల్లికి చెందిన రఘురామయ్య అనే రైతు తన భూమికి సంబంధించి పనిని చేసిపెట్టేందుకు కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, అటెండర్ వెంకటసుబ్బయ్య పది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహశీల్దారు పేరు చెప్పి నగదు తీసుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. 

 

అయితే...నాలుగు రోజులైనా రైతు పని చెయ్యకపోవడంతో రైతు రఘురామయ్య కంప్యూటర్ ఆపరేటర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తొందర పడితే పనులు కావని... తనకు అసలు ఫోన్ చెయ్యొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతు రఘురామయ్య తహశీల్దారుతో మాట్లాడగా అసలు విషయం బయటపడింది. మీ ఫైలే తన దగ్గరకు రాలేదని తెలిపారు. డబ్బుల సంగతి తనకేమి తెలియదన్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను పిలిచి అడుగగా ఆగ్రహానికి గురయ్యాడు. తహశీల్దారు స్వాతి ముందే రైతును నానా మాటలు అని దౌర్జన్యం చేయబోయాడు. విషయం తెలిసిపోవడంతో పదివేలు ఇస్తామని రైతుతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో చెప్పవద్దంటూ ఫోన్ చేసి బతిమాలుకున్నారు. మరి జిల్లా ఉన్నతాధికారులు వారి మీద ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: