సుజ‌నా చౌద‌రి. బిజెపిలో ఉన్నా చంద్ర‌బాబుకి అత్యంత‌ స‌న్నిహితుడైన‌. ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించిన మాజీ టీడీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి. ప్ర‌స్తుతం బీజేపీలో చ‌క్రం తిప్పుతున్నారు. రాజ‌ధాని విష‌యంలో ముందుగా స్పందించి హాట్ హాట్ వ్యాఖ్య‌ల‌తో మీడియాలో నిలిచిన ఆయ‌న త‌ర్వాత కాలంలో బీజేపీ అధిష్టానం ఆగ్ర‌హానికి గురై.. సైలెంట్ అయిపోయారు. అయితే, ఆయ‌న ఏ ఉద్దేశంతో బీజేపీలోకి చేరారో..ఏ కార‌ణంతో టీడీపీని వ‌ద్ద‌నుకున్నారో.. ఆ కార‌ణాలు, ఆఉద్దేశాలు ఇప్పుడు ఆయ‌న‌కు నెర‌వేర‌డం లేద‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇప్పుడు ఆయ‌న‌కు పొంచి ఉన్న బ్యాంకు అప్పు ముప్పే కార‌ణ‌మ‌ని చెబుతున్నా రు. దేశంలోని ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌ల్లో ఒక‌రుగా ఉన్న సుజ‌నా.. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నార‌నేది వాస్త‌వం.

 

వీటిలో కొన్నింటిని ఆయ‌న డిఫాల్ట‌ర్‌గా(ఎగ‌వేత‌) చూపించారు. మ‌రికొన్నింటికి ఆయ‌న ఇచ్చిన హామీలు చెల్లుబాటు కాక‌పోవ‌డం కోర్టుల్లో కేసులు కూడా న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనేఈ కేసుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు, త‌న‌ను, త‌న వ్యాపారాల‌ను కాపాడుకునేందుకు ఆయ‌న ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిన చంద్ర‌బాబుపైనే విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే, ఆయ‌న ఏ ఉద్దేశంతో అయితే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో.. అది పూర్తిగా నెర‌వేర‌డం లేదు. తాజాగా ఆయ‌న ఆస్తుల‌ను వేలం వేసేందుకు ఓ బ్యాంకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఆస్తులను ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) ప్రకటించింది.

 

ఈ మేరకు బీవోఐ చెన్నై లార్జ్‌ కార్పొరేట్‌ శాఖ ఒక ప్రకటనను జారీ చేసింది. సుజనా యూనివర్సల్‌ నుంచి రూ.400 కోట్ల బకాయిలను రికవరీ చేసుకోవటంలో భాగంగా సర్ఫేసీ చట్టం కింద ఈ ఆస్తులను విక్రయిస్తున్నట్లు తెలిపింది.  2018 అక్టోబరు 26 నాటికి సుజనా యూనివర్సల్‌ రూ.322 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ప్రస్తుతం వడ్డీలు కలుపుకుంటే రుణ మొత్తం రూ.400 కోట్లకు చేరుకుందని బీవోఐ తెలిపింది. సుజనా యూనివర్సల్‌ తీసుకున్న రుణాలకు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి), వై.జితిన్‌ కుమార్‌, వై.శివరామకృష్ణ, ఎస్‌టీ ప్రసాద్‌, జి.శ్రీనివాస రాజు, మెస్సర్స్‌ స్ల్పెండిడ్‌ మెటల్‌ ప్రొడక్ట్స్‌, సుజనా క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, సుజనా పంప్స్‌ అండ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నియోన్‌ టవర్స్‌ లిమిటెడ్‌, సార్క్‌ నెట్‌ లిమిటెడ్‌ గ్యారంటీర్లుగా వ్యవహరించారు. అయితే, ఈ బ‌కాయి చెల్లించ‌ని కార‌ణంగా ఆస్తుల‌ను వేలం వేయాల‌ని బ్యాంకు నిర్ణ‌యించింది. ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ నుంచి సుజ‌నాకు ఎలాంటి హామీ ల‌భించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక‌మాదిరిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: