తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి గాను వైసీపీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ పార్టీలో బలంగా ఉన్న నేతల మీద అధికార పార్టీ ఎక్కువగా దృష్టి సారించింది. రాజకీయంగా ఇంకా బలహీనపరచాలి అనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో ఇదే జరిగింది. ఇక ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ని ఎక్కువగా అధికార పార్టీ టార్గెట్ చేసింది అనే ప్రచారం కూడా కొన్ని రోజులుగా జరుగుతుంది.

 

రెండు నెలల క్రితం ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో గొట్టిపాటి రవి కుమార్... చంద్రబాబుతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా తనకు ఎదురు అవుతున్న ఇబ్బందులను ఆయన వివరించారని సమాచారం. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుంది అనే విషయాన్ని చెప్పారు. విజిలెన్స్ దాడులను ముందుగానే ఊహించిన గొట్టిపాటి చంద్రబాబుకి అదే విషయాన్ని చెప్పారు. చంద్రబాబు అప్పుడు... నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారో లేదో... రోజుల వ్యవధిలో గొట్టిపాటి మీద విజిలెన్స్ దాడులు జరిగాయి.

 

ఇటీవల ఒక మంత్రి గొట్టిపాటితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. దీనిపై స్పందించిన గొట్టిపాటి కాస్త ఘాటుగానే సమాధానం చెప్పారట. తాను పార్టీ మారే ఆలోచనలో లేనని, ఇప్పటికే జరుగుతున్న కొన్ని వ్యవహారాలను అధినేత దృష్టికి కూడా తీసుకువెళ్లానని, తన నియోజకవర్గంలో మెజారిటి కార్యకర్తలు తాను పార్టీ మారడానికి అంగీకరించడం లేదని, ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రబాబుతో మాట్లాడతా అని... పార్టీ మారేది లేదని స్పష్టంగా చెప్పారట. ఇక విజిలెన్స్ దాడుల గురించి తాను ఆందోళన చెందడం లేదని, తాను ఈ వ్యాపారంలో ఇప్పటి నుంచి లేననే విషయాన్ని మంత్రిగారికి చెప్పారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: