ప్రస్తుత కాలంలో టిక్ టాక్ యాప్ అందరినీ ఎంతగా ఆకర్షిస్తుందో తెలిసిందే. టిక్ టాక్ యాప్ వలన ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు విడిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పచ్చని కాపురాల్లో టిక్ టాక్ చిచ్చు పెడుతోందని కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ టిక్ టాక్ వలన కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. టిక్ టాక్ యాప్ లో పోస్ట్ చేసిన వీడియో తల్లీకొడుకులను కలిపింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన పద్మ, పెంటయ్యల కుమారుడు కాశీం పుట్టుకతోనే మూగవాడు. చిన్నతనం నుండి కాశీం తరచుగా ఇంటి నుండి పారిపోయేవాడు. కాశీం తల్లిదండ్రులు అతనికోసం చుట్టుపక్కల గ్రామాలన్నీ గాలించి ఇంటికి పట్టుకొచ్చేవారు. ఏడేళ్ల వయస్సులో కాశీం ఇంటినుండి వెళ్లిపోయాడు. అతని తల్లిదండ్రులు ఎంత గాలించినా ఆచూకీ మాత్రం తెలియలేదు. 
 
కుమారుని కోసం వెతికీవెతికీ చివరకు ఆశలు వదిలేసుకొని జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులకు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వారి కుమారుడు మరో గ్రామంలో కనిపించాడని సమాచారం ఇచ్చారు. కాశీం తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి వెతకగా ఆచూకీ లభించలేదు. పదిరోజుల తరువాత మరోచోట కనిపించాడని తల్లిదండ్రులకు సమాచారం అందింది. బాలుడి ఆచూకీ కనుక్కోవడానికి టిక్ టాక్ యాప్ సహాయపడింది. 
 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చల్లూరు గ్రామంలో కాశీం తిరుగుతుండగా కొందరు యువకులు కాశీం ను మొబైల్ లో చిత్రీకరించి టిక్ టాక్ వీడియో చేశారు. టిక్ టాక్ యాప్ లో తమ కుమారుడిని చూసి కాశీం తల్లిదండ్రులు చల్లూరుకు వెళ్లగా అక్కడ కాశీం ఆచూకీ లభించలేదు. అదే సమయంలో తలకొండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సికింద్రాబాద్ లో కాశీం కనిపించటంతో అతనిని చేరదీశారు. కాశీంను టిక్ టాక్ వీడియోలో అంతకుముందే చూసి ఉండటంతో వారు కాశీంను గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాశీం తల్లిదండ్రులు సికింద్రాబాద్ కు వచ్చి కుమారుడిని గ్రామానికి తీసుకెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: