ఎక్కడైనా వర్కింగ్ ఉమెన్ కు మెటర్నటీ లీవ్ ఉంటుంది. అంటే ప్రసూతి సెలవు.. కానీ అదే సమయంలో తండ్రికి మాత్రం సెలవు ఉండదు. కానీ తండ్రి అంటే ఉండే బాధ్యలు కూడా అన్నీ ఇన్నీ కావు.. తల్లి అంత కాకపోయినా.. తండ్రి కావడం కూడా చాలా క్లిష్టమైన బాధ్యతే. అందుకే ఆ దేశం తల్లి తో పాటు తండ్రికీ సెలవు ఇచ్చి గౌరవిస్తోంది.

 

ఇంతకీ ఆ దేశం ఏంటి అంటారా.. అదే ఫిన్లాండ్‌ ప్రభుత్వం. లింగ సమానత్వానికి అసలైన అర్థం చెప్పింది ఈ దేశం. వర్కింగ్‌ ఉమెన్‌కు ఇచ్చే ప్రసూతి సెలవులతో సమానంగా.. మగవాళ్లకూ పెటర్నటీ సెలవులను పెంచింది. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలను భార్యాభర్తలిద్దరూ పంచుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందంటోంది ఫిన్లాండ్‌ ప్రధాని సనామారిన్‌.

 

ఇప్పటికే స్వీడన్‌, ఐస్‌లాండ్‌ వంటి దేశాల్లో తండ్రులకు సెలవులు పెంచిన తరువాత జననాల రేటు పెరిగినట్టు ఫిన్లాండ్ చెబుతోంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు తల్లికి 4.2 నెలలు, తండ్రికి 2.2 నెలలు సెలవులు తీసుకునే వీలుండగా, ఇప్పుడు ఇద్దరూ 164 రోజుల చొప్పున పెయిడ్‌ లీవ్స్‌ తీసుకునే వీలు కల్పించారు. దీంట్లో 69 రోజులను ఒకరికొకరు మార్చుకోవచ్చు. సింగిల్‌ పేరెంట్‌గా ఉన్నవారు ఇద్దరికీ వర్తించే 328 రోజులూ పెయిడ్‌ లీవ్స్‌ తీసుకునే అవకాశం కల్పించడం విశేషం.

 

ఫిన్లాండ్‌లో మహిళలు నేతృత్వం వహిస్తోన్న అయిదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం.. మొదటి నుంచి లింగసమానత్వానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇంతకు ముందున్న పెటర్నటీ సెలవులను రెట్టింపు చేసి, ప్రసూతి సెలవులతో సమానంగా ఏడు నెలలకు పెంచింది. వైద్యులు నిర్దేశించిన ప్రసవ తేదీకి నెలరోజుల ముందు నుంచి సెలవులు తీసుకునే వెసులుబాటు మహిళలకు కల్పించింది. సెలవులు పెంచడం ద్వారా ఇంటి పనులను భార్యాభర్తలిద్దరూ సమన్వయం చేసుకోగలరని, తగ్గుతున్న జనన రేటు పెరుగుతుందని, విడాకుల కేసులూ తగ్గుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఫిన్లాండ్‌ ఆరోగ్యశాఖ మంత్రి అన్నా కైసా పెకొనెన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: