విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలన్న జగన్ సర్కార్ నిర్ణయానికి అడ్డంకులు వచ్చి పడుతున్నాయా? మిలీనియం టవర్స్ కేంద్రంగా పరిపాలన సందిగ్ధంలో  పడిందా? రుషికొండ లో సచివాలయ ఏర్పాటుకు ఇండియన్ నేవీ మోకాలడ్డుతోందా..? రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఐటీ శాఖ మంత్రి సైతం మిలీనియం టవర్స్ నుంచి పరిపాలన ప్రతిపాదనను తోసిపుచ్చడం ...ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చేలా ఉంది. 

 

విశాఖలోని రుషికొండ మిలీనియం టవర్స్ కేంద్రంగా.. తాత్కాలిక సచివాలయం నిర్వహణ ప్రచారం పీక్స్‌కు వెళ్లిపోయింది. సెక్రటేరియట్ నిర్వహణ కోసం సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అవసరం కాగా.. తాత్కాలిక సచివాలయం నిర్వహణకోసం భవనాలను అన్వేషించిన అధికారులను.. మిలీనియం టవర్స్ ఆకర్షించాయి. విశాఖ నుంచి భీమునిపట్నం వెళ్లే బీచ్ రోడ్ లో ఉన్న రుషికొండ ప్రత్యేక ఆర్థిక మండలి లోని టవర్స్ అన్ని విధాలుగానూ అనుకూలమనే సూచన ప్రాయ నిర్ధారణకు వచ్చారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి  ప్రకటన లేనప్పటికీ....కొంతకాలంగా రాజధాని అంటే మిలీనియం టవర్స్ అనే అభిప్రాయం కలిగింది.

 

మిలీనియం టవర్స్ లోని ఏ, బి బిల్డింగ్స్ కలిపి మూడున్నర లక్షల చదరపు అడుగుల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది.  నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన బి టవర్ పూర్తి చేసేందుకు 19 కోట్ల70లక్షల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. రాజధాని కోసమే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఐటీవర్గాలు తోసిపుచ్చాయి. ఈ తరుణంలో మిలీనియం టవర్స్‌పై మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ఎంపిక చేసుకున్న ప్రదేశంపై నావికాదళం కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినట్టు సమాచారం. కాపుల ఉప్పాడలో శాశ్వత రాజధానిపై ప్రచారం జరిగిన సమయంలోను నావికాదళం నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా భీమిలి సమీపంలోని ఐఎన్‌ఎస్ కళింగ రక్షణ స్థావరం గురించే.. నావీ ఆందోళన అని సమాచారం. విపక్ష టీడీపీ ఈఅంశాన్ని హైలెట్ చేస్తోంది.

 

తాజాగా రుషికొండ హిల్ నెం -2 లోని ఇన్నొవేషన్ సొసైటీలో ఐటీ ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలు, నేవీ అభ్యంతరాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ ప్రతినిధులతో సమావేశం అనంతరం మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని ఎప్పుడు చెప్పలేదని మంత్రి మేకపాటి తెలిపారు. సెక్రటేరియట్ కోసం తాము చేసుకున్న ఒప్పందానికి... మిలీనియం టవర్స్‌కు  సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిధులుకేటాయించినప్పుడల్లా... అది సెక్రటేరియట్‌కే అంటే ఎలా అని ప్రశ్నించారు మంత్రి.ఇదంతా ప్రతిపక్షాలు చేసే ప్రచారమే తప్ప మరొకటి కాదని కొట్టిపడేశారు. ఏదేమైనా మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ అంశానికి నేవీ అడ్డు చెప్పిందన్న అంశం మాత్రం.. రాష్టంలో చర్చనీయాంశంగా మారుతోంది. దీన్ని అధికార , విపక్షాలు రాజకీయకోణం చూడడం మరింత హీటు పెంచిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: