ఇంట్లో ఫ్యామిలీతో కలిసి సరదాగా సీరియళ్లు, సినిమాలు చూస్తున్నారా...? ఒకసారి కనెక్షన్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మంచిది. కనెక్షన్లు సరిగ్గా లేకుంటే మాత్రం మీ టీవీ కూడా బాంబులా పేలే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ పేలి మహిళ మృతి చెందిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళ భర్తకు, ఆరు నెలల వయస్సు ఉన్న పాపకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ఒడిశాలోని లహండబుడ గ్రామానికి చెందిన బాబీ నాయక్, ఢిల్లేశ్వర నాయక్ దంపతులు శుక్రవారం రోజు రాత్రి సమయంలో టీవీలో సీరియల్ చూస్తున్నారు. అకస్మాత్తుగా టీవీ పేలడంతో స్థానికులు బాంబు పేలిందేమో అని తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకుందామని స్థానికులు ఢిల్లేశ్వర నాయక్ ఇంటి దగ్గరకు వెళ్లగా దంపతులు, పాప అపస్మారక స్థితిలో ఉన్నారు. 
 
స్థానికులు వెంటనే వారిని ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. గాజు ముక్కలు కడుపులో దిగి తీవ్రగాయాలపాలైన బాబీ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మహిళ భర్త, చిన్నారి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వైద్యులు తీవ్ర గాయాలపాలయిన ఢిల్లేశ్వర నాయక్, పాప పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు. పరిస్థితి విషమించడంతో వారిని రూర్కెలాలోని ఇస్పాట్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. 
 
శివరాత్రి పండగ రోజున ఈ ఘటన జరగటంతో స్థానికంగా విషాదం నెలకొంది. మహిళ మృతి చెందటంతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు షార్ట్ సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీలు పేలాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: