పాపం మాజీ మంత్రి.. ఆమె బాధ‌ల‌న్నీ అన్నీఇన్నీ కావు. అస‌లే పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఆపై క‌నీసం ఎమ్మెల్యే ప‌ద‌వికూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గంగుల కుటుంబాన్ని ఎదుర్కొంటూ ఉనికిని చాటుకునేందుకు, ప‌ట్టు నిలుపుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇప్పుడు ఆమె ముందు పెద్ద టాస్క్ ఉంది. ఎలాగైనా అందులో నెగ్గి, త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను చాటుకోవాల‌ని చూస్తున్నారు. త‌న అనుచ‌ర‌గ‌ణంలో ఆత్మ‌స్థైర్యం నింపాల‌ని అనుకుంటున్నారు. కానీ.. అదంతా సుల‌భం కాక‌పోవ‌డంతో ఆమె తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.



ఇంత‌కీ ఆ మాజీ మంత్రి ఎవ‌రు..? ఆమె ముందున్న స‌వాల్ ఏమిటి? అని అనుకుంటున్నారా..? అయితే, మీరు ఈ క‌థ‌నం చ‌దివితీరాల్సిందే మ‌రి. క‌ర్నూలు జిల్లా నంద్యాల అన‌గానే మ‌న‌కు రెండు కుటుంబాలు గుర్తుకు వ‌స్తాయి. ఇక్క‌డ భూమా, గంగుల కుటుంబాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఆధిప‌త్యం కోసం నిరంత‌రం తీవ్ర‌పోటీ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంటుంది.  ఇక్క‌డ ఏ చిన్న‌పాటి ఎన్నిక జ‌రిగినా ఆ రెండు కుటుంబాల మ‌ధ్య ఉండే పోటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా, ఇదే వాతావ‌ర‌ణం నెల‌కొంది.



కొద్దిరోజుల్లో నంద్యాల మిల్క్‌ డెయిరీ చైర్మన్‌ పదవి కోసం ఎన్నికలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇప్పుడు ఈ ప‌ద‌విని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని భూమా, గంగుల కుటుంబాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు  చేస్తున్నాయి. అయితే, చైర్మ‌న్ ప‌ద‌వీకాలం గ‌త డిసెంబ‌ర్‌లో ముగిసింది. ఇక డైరెక్ట‌ర్ల ప‌దవీకాలం ఐదేళ్లు. ప్ర‌తీ ఏడాది ముగ్గురు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతారు. వీరి స్థానంలో కొత్త‌వారిని ఎన్నుకుంటారు. అయితే, మొత్తం 15మంది డైరెక్టర్లు ఉంటారు. వీరి నుంచే ఒక‌రిని చైర్మ‌న్‌ను ఎన్నుకుంటారు. ఈసారి ఖాలీ అయిన మూడు డైరెక్ట‌ర్ల కోసం పోటీ తీవ్ర‌స్థాయిలో ఉంది.  గంగుల విజయ సింహారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్‌ విఖ్యాత్‌డ్డి, భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన బీజేపీ నాయకుడు కిశోర్‌రెడ్డితో పాటు మ‌రికొంద‌రు పోటీప‌డుతున్నారు.



గత 26 ఏళ్లుగా చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఉందంటున్నారు.  కానీ.. ఇందులో భూమా కుటుంబం, గంగుల కుటుంబం మ‌ధ్య‌నే పోటీ తీవ్ర ఉంది. ఎలాగైనా చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకొని ప‌ట్టు నిలుపుకోవాల‌ని మాజీ మంత్రి అఖిల‌ప్రియ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అధికార వైసీపీకి చెందిన‌ గంగుల కుటుంబం కూడా అంత సుల‌భంగా వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా ఉండ‌దు

.

ప్రస్తుతం ఉన్న 12 మంది డైరెక్టర్లలో భూమాకు అయిదుగురు, గంగులకు నలుగురు, మిగిలిన ముగ్గురు వేర్వేరు వర్గాలకు చెందిన వారు. కొత్తగా ఎన్నికయ్యే ముగ్గురు డైరక్టర్లే అత్యంత కీల‌కం కానున్నారు. ఈ మూడు డైరెక్ట‌ర్ల‌ను గెలుచుకునేందుకు రెండు కుటుంబాలు పోటీప‌డుతున్నాయి. 26 ఏళ్లుగా భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికవుతున్నారు. కానీ ఈసారి మాత్రం ప‌రిస్థితి త‌ల‌కిందులయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.



ఏక‌గ్రీవం అనే మాటే ఉండ‌ద‌ని, తీవ్ర పోటీ త‌ప్ప‌ద‌ని ఇరువ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఒక వైపు భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, మరో వైపు గంగుల ప్రభాకర్ రెడ్డి, బిజేంద్రరెడ్డి, సుభాష్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఎవ‌రిది పైచేయి అవుతుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.  

మరింత సమాచారం తెలుసుకోండి: