కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య రహస్య మైత్రి కొనసాగుతుందని ఆరోపణలు చేశారు. . కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు సొంత ఇల్లు కట్టుకోవడానికి నిధులను ఇస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని కామెంట్లు చేశారు. 
 
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ నిధులను పక్కదారి పట్టిస్తున్నప్పటికీ ఎందుకు రివ్యూ చేయటం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. చింతమడకకు ఎంపీటీసీలా, ఎర్రవల్లికి సర్పంచ్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సంవత్సరంలోపు లక్ష ఇళ్లు ఇస్తామని చెప్పారని ఇప్పుడు మాత్రం ఇళ్ల ఊసే ఎత్తటం లేదని మండిపడ్డారు. 
 
కేసీఆర్ ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుందని గ్రేటర్ ఎన్నికల కోసమే కేసీఆర్ పట్టణ ప్రగతి మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో లక్ష ఇండ్లు ఇస్తామని చెప్పారని కానీ ఇచ్చింది కేవలం 108 ఇండ్లు మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై సీఎం కేసీఆర్ విధివిధానాల వలన 3 లక్షల రూపాయల భారం పడిందని రేవంత్ అన్నారు. 
 
గ్రేటర్ లోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పది లక్షల మంది అర్హులుగా ఉన్నారని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది అర్హులుగా ఉన్నారని అన్నారు. పట్నం గోసం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడతామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: