ఎందరో పర్యాటకులను తమ దేశ అందచందాలతో ఆకర్షించే ఫ్రాన్స్, ఇప్పుడు యుద్దభూమిగా మారబోతుందా.. అంటే అవుననే అంటున్నారు అక్కడి ప్రజలు, అధికారులు.. యుద్ధప్రాతిపదికన ఈ యుద్దం కోసం అన్ని సిద్దం చేసుకున్నారు. ఇక వేటకు బయలుదేరి దొరికిన దాన్ని దొరికినట్లుగా చంపడమే.. ఇదేంటి యుద్ధం అన్నారు, దొరికిన దాన్ని దొరికినట్లుగా చంపడం అంటున్నారని పరేషాన్ అవకండి. యుద్దాన్ని ప్రకటించింది నిజమే కానీ దేశాల మీద కాదు. నల్లుల మీద.. ఫ్రాన్స్‌లో అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న నల్లుల మీదే ఈ పోరు..

 

 

ఈ దేశ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నల్లులను సమూలంగా నాశనం చేయడానికి, అక్కడి ప్రభుత్వం కంకణం కట్టుకుంది... అయితే డీడీటీ అనే కెమికల్ వాడి దేశంలో నల్లుల నామరూపాలు లేకుండా రెండవ ప్రపంచ యుద్ధకాలంలో చేసింది. తదనంతర కాలంలో డీడీటీ వాడకంపై నిషేధం విధించడంతో నల్లులు మెల్లగా తమ ప్రతాపాన్ని చూపడం మొదలు పెట్టాయట.. ఇక స్వదేశి నల్లులే కాదు, విదేశాల్లో ఉండే తమ చుట్టాలను, బంధువులను కూడా పిలిపించుకుని, ఫ్రాన్స్ ‘పౌరసత్వం’ ఫ్రీగా ఇప్పిస్తున్నాయట.

 

 

దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన ప్రభుత్వం తాజాగా రంగంలోకి దిగి 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి.. ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు గాను ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను లాంచ్ చేసి ఎమర్జెన్సీ నెంబర్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.  ఏకంగా నల్లుల నిర్మూలన దళాన్ని కూడా ఏర్పాటు చేసింది.. మనదేశంలో 108 లాగా, అక్కడి ప్రజలు వెబ్‌సైట్‌లోని నెంబర్లను సంప్రదిస్తే చాలు. క్షణంలో ఆ దళాలు ప్రత్యక్షమై ఈ పురుగుల నుంచి విముక్తి కలిగిస్తాయట.

 

 

అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారికి ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా అందిస్తుండగా, స్తోమత కలిగినవారు మాత్రం కొంత రుసుము చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.. ఇకపోతే రాబోయే రోజుల్లో నల్లులు లేని దేశంగా ఫ్రాన్స్ మారుస్తామని కీలక నేత ఒకరు ఇటీవల ఘనంగా ప్రకటించి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది వినడానికి సిల్లిగా అనిపించిన నల్లులతో బాధపడేవారికి తెలుస్తుంది ఆ బాధ... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: