హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్‌. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ఈ తీపిక‌బురు వినిపించారు. ఇందులో ఓ వైపు అభివృద్ధి కోణం క‌నిపిస్తున్నప్ప‌టికీ మ‌రోవైపు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ ఉంద‌ని ఇంకొంద‌రు అంటున్నారు. స‌రే లెక్క‌లు ఎలా ఉన్నా...న‌గ‌రం రూపు మారుతుందంటే సంతోష‌మ‌ని మ‌రికొంద‌రు పేర్కొంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... హైదరాబాద్‌ నగరపౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందిస్తుంద‌ట ప్ర‌భుత్వం. ఇందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) చట్టాన్ని మార్చనున్నార‌ట‌.

 

 

మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మున్సిపల్‌ చట్టం స్ఫూర్తితో అందులోని నిబంధనలను యథాతథంగా జీహెచ్‌ఎంసీ చట్టంలోకి తీసుకొనిరావాలని సూచించారు.  సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో అమలులోకి తీసుకొచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టంలోని అన్ని కీలకమైన అంశాలను జీహెచ్‌ఎంసీ నూతన చట్టంలో పొందుపరచనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెల్‌ సమావేశాల నాటికి నూతన చట్టాన్ని ఆమోదంకోసం సిద్ధంచేయాలన్నారు. 

 


 జీహెచ్‌ఎంసీ చట్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, పౌరసేవల వేగవంతం, ప్రజాప్రతినిధులపై బాధ్యత పెంచడం, అధికారులు బాధ్యతగా వ్యవహరించేలా చూడటం వంటి అంశాలను ఈ చట్టంలో పొందుపరచాలని పేర్కొన్నారు. కొత్త చట్టం ద్వారా ప్రజలకు అనేక సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ముఖ్యంగా త్వరలో తీసుకురానున్న తెలంగాణ భవన అనుమతుల ప్రక్రియ (టీఎస్‌బీపాస్‌) నేపథ్యంలో దానికి అనుగుణంగా అవసరమైన మార్పులను జీహెచ్‌ఎంసీ నూతన చట్టంలో తీసుకొనిరావాలని ఆదేశించారు.

 

 

ఇప్పుడు కొనసాగుతున్న ఎస్సార్డీపీ, రోడ్ల నిర్వహణ, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. జోన్ల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుపోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా టాయిలెట్ల నిర్మాణం, పార్కుల నిర్వహణ, జంక్షన్ల అభివృద్ధి, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రాథమిక కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. ఇలాంటివాటి కోసం ప్రత్యేక ఐటీ డ్యాష్‌బోర్డు ఏర్పాటుచేయాలని, దీనిద్వారా ఆయా కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తానని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హెచ్‌ఎండీఏ పరిధిలో కూడా భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ స్థాయిలో ప్రతి కమిషనర్‌ మరింత చొరవగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.  కాగా, గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున‌..కేటీఆర్ ఈ మేర‌కు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా? అంటూ కొంద‌రు డౌట‌నుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: