ఆన్‌లైన్ ర‌మ్మీ గేముల‌ గురించి మీకు తెలుసు క‌దా?  కొంద‌రు ఇంట్లో పెళ్లాం, పిల్ల‌ల‌ను వ‌దిలేసి కూడా.... మూడు ముక్క‌లాట‌లో అస‌లు మ‌జా ఉంద‌ని భ్ర‌మించేలా చేసిన ఆన్‌లైన్ గేమ్‌. తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల్లో వీటిని నిషేధించారు. అయితే, ఇలాంటి మ‌రికొన్ని ఆట‌లు కూడా ఉన్నాయి. అవి అలా ఉంచితే..తాజాగా ఓ ఆన్‌లైన్ గేమ్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. యూత్‌లో ఉన్న భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొని వాళ్లు డ‌బ్బులు సంపాదించుకుంటున్న తీరు మైండ్ బ్లాంక‌య్యేలా ఉంది. దాదాపు పది రోజుల కిందట కనిపించకుండా పోయిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి కేసును దర్యాప్తు చేస్తుండగా సైబరాబాద్‌ పోలీసులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలిశాయి.

 

 

అదృశ్య‌మైన ఆ  ఇంజినీరింగ్‌ విద్యార్థికి క్రికెట్‌ అంటే ప్రాణమని తేలింది. దాని కోసం తరగతులకు కూడా హాజరు కాకుండా ఉండేవాడు. అందులో రంజీ మ్యాచ్‌లైనా సరే దానికి సంబంధించి లైవ్‌ టీవీల్లో ఉన్నా, సోషల్‌ మీడియాలో ఉన్నా అతను వాటిని చివరి వరకు వీక్షించేవాడు. ఈ నేపథ్యంలోనే అతను అదృశ్యమైన రోజు కూడా అదే చేశాడు.మరింత లోతుగా కేసు విచారణ చేస్తున్న పోలీసులకు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆ విద్యార్థి ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు పలు పెయిడ్‌ గేమ్‌ల కోసం డబ్బులు వెచ్చించినట్లు తెలిసింది. ఆ ఆటల కోసం ఆన్‌లైన్‌లో ఉండే వెబ్‌సైట్ల నుంచి రుణాలు పొందినట్లు వెల్లడైంది. అలా రుణాలు పొందే సమయంలో తన ఆధార్‌ కార్డు, అతని ఫోన్‌ నంబరు, తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, సోదరుడి ఫోన్‌ నంబరును ష్యూరిటీగా ఇచ్చాడు. సదరు డబ్బులు తిరిగి చెల్లించే గడువు గడిచిపోవడంతో ఆ రుణ సంస్థల నుంచి ఇటీవల మాటిమాటికి తల్లిదండ్రులకు కాల్స్‌ వచ్చాయి. ఈ రుణాల విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందనే కారణంగా అతను కళాశాల హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడని పోలీసులు బావిస్తున్నారు. 

 

అయితే, ఈ ఘ‌ట‌న‌ల‌పై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో విద్యార్థులను ఆకర్షిస్తున్న ఈ కొత్త పోకడలు విద్యార్థుల చదువులను, యువతరం భవిష్యత్తును చిద్రం చేస్తున్నాయని చెప్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఈ ఆన్‌లైన్‌ పేయిడ్‌ గేమింగ్‌కు అలవాటు పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నది. దీని కోసం వారు పలు సంస్థలు ఇచ్చే ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని గేమింగ్‌, బెట్టింగ్‌లలో డబ్బులు పెడుతున్నట్లు తెలిసింది. ఇలా విద్యార్థులు ఈ గేమింగ్‌ ఆటలకు వ్యసనపరులుగా మారుతున్నారని పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఈ బెట్టింగ్‌ల కోసం వేలాది రూపాయలు అప్పులు తీసుకుని బోల్తా పడుతున్నారు. ఇంట్లో వారు తీవ్రంగా మందలిస్తారని వణికిపోయి చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. త‌ల్లిదండ్రులు ముందు నుంచే త‌మ పిల్ల‌ల గురించి జాగ్ర‌త్త వ‌హించాల‌ని...విద్యార్థులు సైతం న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: