ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ఈఎస్ఐ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పాత్ర ఈ కుంభకోణంలో ఉందని వార్తలు విపించాయి. నివేదికలో అచ్చెన్నాయుడు పేరు ఉండటంతో వైసీపీ పార్టీ నేతలు అచ్చెన్నాయుడుపై విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడు ఇప్పటికే ఏపీ ఈఎస్ఐ కుంభకోణం గురించి స్పందించారు. 
 
అచ్చెన్నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా బొమ్మాళి మండలం నిమ్మాడలో ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తమకు తప్పు చేసే అలవాటు లేదని పదిమందికి మంచి చేసే పనులు మాత్రమే చేస్తామని అన్నారు. ఎక్కడా తప్పు చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎర్రన్నాయుడు సాక్షిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. 
 
ఏపీ సీఎం జగన్ దగ్గర తన పాలనకు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయని అన్నారు. మనుషుల మనోభావాలను దెబ్బ తీయాలని వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని మనోభావాలు దెబ్బ తీసినంత మాత్రాన జడిసే కుటుంబం తమది కాదని అన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. వైసీపీ ప్రభుత్వం దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయని అచ్చెన్నాయుడు ఎవరికీ భయపడడని అన్నారు. 
 
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇచ్చాడని ప్రస్తావించింది. అచ్చెన్నాయుడు టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్లు ఇవ్వడంలో ఒత్తిడి తెచ్చారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అధికారులు వాస్తవ ధర కంటే 136 శాతం అధికంగా సంస్థలు టెండర్లలో చూపించారు. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందో లేదో తేలాల్సి ఉంది.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: