కుప్పం నియోజకవర్గం...చంద్రబాబు అడ్డా. ఆయన 1989 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇక్కడ ఆయన్ని ఓడించడం కష్టం కాబట్టి, మెజారిటీ మాత్రం తగ్గించడం చేయగలుగుతున్నారు. ఇక చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో జగన్ బాగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. 2014లో 47 వేల పైనే మెజారిటీతో గెలిచిన చంద్రబాబు, 2019లో 30 వేల ఓట్లుతో గెలిచారు. అంటే దాదాపు 17 వేలు మెజారిటీ తగ్గిపోయింది. ఇది కేవలం జగన్‌కే సాధ్యమైంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఉన్న ఆయన హవా, కుప్పంలో కూడా నడిచింది.

 

అయితే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తగ్గించి షాక్ ఇచ్చిన జగన్..ఇప్పుడు చంద్రబాబుని చావుదెబ్బ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయడానికి స్కెచ్ వేశారు. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబుకు సాధ్యంకాని పనిని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేశారు. కుప్పం మేజర్ పంచాయితీని..మున్సిపాలిటీగా మార్చేశారు. ఆ మేరకు జీవో కూడా జారీ చేశారు.

 

ఇక జీవో రావడమే అధికారులు కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా కుప్పం పురపాలక సంఘాన్ని 25 వార్డులుగా విభజిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. కుప్పం పురపాలక సంఘం వార్డు విభజనకు సంబంధించి మున్సిపల్‌ కమిషనర్‌ వచ్చే నెల 2వ తేదీన తుది ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అక్కడ నుంచి కుప్పం మున్సిపాలిటీగా మారుతుంది.

 

ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం ఏకపక్షమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. పైగా కుప్పం అభివృద్ధికి జగన్ గ్యాపు లేకుండా నిధులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంత ఖర్చు పెడుతున్నారు కూడా. ఈ క్రమంలోనే కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే వైసీపీ గెలవాల్సిందే. అటు కుప్పం ప్రజలు కూడా జగన్ పట్ల పాజిటివ్‌గా ఉన్నారు. దీంతో కుప్పంలో బాబుకు చావుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: