అక్కడంతా ఇంచార్జ్ ల పాలనే... ఆదివాసీల సంక్షేమం కోసం నెలకొల్పిన ఐటీడీఏలో, వాళ్ల కోసం పనిచేసేందుకు అధికారులే దిక్కులేరు. ఏ డిపార్ట్ మెంట్ లో చూసినా ఖాళీ కుర్చీలే దర్శన మిస్తున్నాయి. కొన్ని విభాగాల్లో ఇంచార్జ్ లతో నెట్టుకొస్తుంటే ..మిగతా శాఖలకు హెచ్ వోడీలు సైతం లేని దుస్థితి. 

 

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ గిరిజన అభివృద్ది కోసం ఏర్పాటు చేసినా అదికారుల కొరత, నిధుల లేమితో ఆశించిన ఫలితాలు అందకుండా పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యం తో కొనసాగుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏలో అధికారుల కొరత నేడు ఒక పెద్ద సమస్య గా తయారైంది. ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు పాత జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. దీంతో ఈ నాలుగు జిల్లాలోని ఆదివాసుల సమస్యలను పరిష్కారం చేసి, వారిని ఆదుకునే బాధ్యత ఇక్కడి ప్రాజెక్టు అధికారిపై ఉంది.  

 

ఉమ్మడి జిల్లాలోని గిరిజనులు విద్య, వైద్య, వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో రాణించాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటిడీఏలో శాంక్షన్ పోస్టులు 85 ఉంటే అందులో 67 ఖాళీలే ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా కొన్ని శాఖల అధికారులు ఉన్న బాధ్యతలకు తోడు అదనపు బాధ్యతలతో తలమునకలయ్యారు. దాంతో ఆదివాసులు ఆశించిన రీతిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు.

 

ఇందులో ముఖ్యంగా ఇంజనీర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ, గురుకులంతో పాటు ఇతర శాఖ లైన పబ్లిసిటీ, ఐసిడిఎస్, ఐటీడీఏ కార్యాలయంలో కొనసాగుతున్నాయి.  వేటిలోనూ  పూర్తి స్థాయి స్టాఫ్ లేరు. స్టాటికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్స్ ఐదు పోస్టులు,  సబ్ అసిస్టెంట్స్  మూడు పోస్టులు,  ఎపిఓ  తోపాటు 10 మంది సీనియర్ అసిస్టెంట్స్, ఐదుగురు టైపిస్టులు, ఒక అకౌంటెంట్  లేక ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. 

 

ఔట్ సోర్సింగ్ 13 పోస్టులు మంజూరు అవ్వగా మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇలా అన్ని డిపార్ట్ మెంట్ లలో ఖాళీలుండగా పనిచేసే వాళ్లే దిక్కులేరు. గెజిటెడ్ ,నాన్ గెజిటెడ్ పోస్టులనే తేడా లేకుండా అన్నింటిలో ఖాళీలే ఉండడం గిరిజనుల అభివృద్ది అటకెక్కిందనే ఆగ్రహం ఆదివాసీలు వ్యక్తం చేస్తున్నారు.  చాలాకాలంగా పాతుకొని పోయిన ఉద్యోగులు ఇంకా ఇక్కడే ఉండడం మరో సమస్య గా మారిందంటున్నారు. వచ్చే నిధులను కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీడీఏ పునర్ వ్యవస్థీకరించాలని గిరిజనులు కోరుతున్నారు. అధికారులను పూర్తిస్థాయిలో నియమించి ఆదివాసులు అభివృద్ధి పై దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: