గరుడ వారధికి దారేది? ఇది ఏదో సినిమా టైటిల్ అనుకునేరు! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్. కానీ.. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా ఈ వారధి నిర్మాణంలో అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి.  

 

శ్రీవారి దర్శనానికి నిత్యం లక్ష మంది భక్తులు వస్తుండటంతో తిరుపతి ట్రాఫిక్ చక్రబంధనంలో చిక్కుకుంటోంది. ఇదే సమయంలో తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని కేంద్రం భావించడంతో తిరునగరి దశా దిశా మారుతుందని అంతా భావించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పక్షి ఆకారంలో గరుడ వారధి  పేరుతో ఓ  ఫ్లైఓవర్ నిర్మించాలని భావించారు కార్పొరేషన్ అధికారులు. రామానుజ సర్కిల్ నుంచి లీలా మహల్ సర్కిల్ వరకు 200 కోట్ల నిధులతో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

అయితే  భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మ్యాంగో మార్కెట్ నుంచి కపిలతీర్థం సర్కిల్ వరకూ ఫ్లై ఓవర్ నిర్మించేలా డిజైన్ లో మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడా భూ సేకరణ అవసరమే లేకుండా డిజైర్ రూపొందించారు. కాకపోతే నిర్మాణానికి 684 కోట్లు అవుతుందని తేల్చారు. ఇందులో కేంద్రం వాటా 33శాతం అయితే.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 67శాతంగా తేల్చారు. రెవెన్యూ లోటు కారణంగా తన వాటా 456 కోట్ల భారాన్ని టీటీడీయే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో టీటీడీ కూడా దీనికి ఓకే చెప్పింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 

 

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో.. 25 శాతం పనులు పూర్తికాని వాటిని నిలిపివేయాలని తొలుత ఆదేశాలు వెళ్లాయి. వారధి పనులు ఆగిపోయాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, టీటీడీ కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆగిన పనులను మళ్లీ ప్రారంభించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తమకు సహకరిస్తే 24 నెలల కాలంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 18 నెలల్లోనే కంప్లీట్‌ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు టీటీడీకి తెలిపారు. దీనికి టీటీడీ నుంచి స్పందన లేదట. మొదట ప్రాజెక్టును రీ డిజైన్ చేయ్యాలని..రీ టెండరింగ్ కి వెళ్లాలని.. ఆ తర్వాతే  నిధుల కేటాయింపు గురించి ఆలోచిస్తామని  చెప్పిందట టీటీడీ. 

 

వాస్తవానికి కేంద్రం ఇస్తున్న నిధులతో ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 150 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. స్మార్ట్ సిటీ కిందే ఈ నిధులను కేటాయించారు. ప్రాజెక్టు ఇంకా వేగంగా సాగాలంటే టీటీడీ తన వాటా నిధులు రిలీజ్ చెయ్యాల్సి ఉంది. ఈ సమయంలో ఒక మెట్టు కిందకు దిగిన టీటీడీ రీ టెండరింగ్ ను పక్కన పెట్టి.. రీడిజైన్ కోసం వరంగల్ NIT ప్రొఫెసర్ ప్రసాద్ ద్వారా పరిశీలన జరిపించింది. ఆ తర్వాత గరుడ వారధి ప్రాజెక్టును అర్బన్ హట్ వరకూ పెంచారు. దీంతో ప్రాజెక్టు వ్యయం మరో 80 కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు. అన్నీ కుదిరితే ఈ ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, వచ్చే ఏడాది 50 కోట్లు కేటాయించేందుకు టీటీడీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: