ఉల్లిపాయ మొదలుకొని... కూరగాయల వరకు ఏది కావాలన్నా ఒకే చోట దొరుకుతాయి. నాన్ వెజ్‌ వెరైటీల కోసమైతే ఊరంతా తిరగాల్సిన పనే లేదు. ఐటెమ్స్‌ అన్నీ ఒకే బిల్డింగ్‌లో దొరుకుతున్నాయి. దీంతో వినియోగదారులు సైతం ఆ మార్కెట్‌కే క్యూ కడుతున్నారు. ఒకే చోట కావాల్సినవన్నీ దొరుకుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. మొత్తం దేశానికి ఆ మార్కెట్‌ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

 

దేశంలోనే అతి పెద్ద సమీకృత మార్కెట్‌ను గజ్వేల్‌లో ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. ఇంతకు ముందు రోడ్డుపైన ఉండే వ్యాపారాలన్నీ ఇప్పుడు పెద్ద భవనంలోకి మారిపోయాయి. గత ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన మార్క్‌పెడ్ భవనంతో గజ్వేల్‌ రూపు రేఖలే మారిపోయాయి. పక్క జిల్లాల నుంచి సైతం ఈ మార్కెట్‌కి జనం క్యూ కడుతున్నారు.

 

గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌ భవనం కోసం దాదాపు 22 కోట్ల 80 లక్షలు ఖర్చు చేశారు. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు. మొత్తం 246 స్టాల్స్‌ ఉంటాయి. కేవలం రెండున్నర నుంచి 3 ఫీట్ల హైట్‌తో ఈ షాపులను నిర్మించారు. బాక్టీరియా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ కూరగాయల దుకాణాలు, ఫ్రూట్స్, ఫ్లవర్ షాపులు వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్‌కు వేర్వేరుగా షాపులు ఏర్పాటు చేశారు. మటన్, చికెన్, ఫిష్ దుకాణాలు ఉన్నాయి. గజ్వేల్‌లో ఎవరు నాన్ వెజ్ కొనాలన్నా కచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే బయట ఎక్కడా నాన్‌వెజ్‌ దొరకదు. 

 

విశాలమైన పార్కింగ్, పిల్లలతో వస్తే ఆడుకోవడానికి ఆట స్థలం లాంటి సకల సదుపాయాలు కల్పించారు. సూపర్ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది. మొత్తం ఆరున్నర ఎకరాలలో ఆరు బ్లాకుల్లో ఈ మార్కెట్‌ను నిర్మించారు. ఇక్కడి వ్యర్ధాలను ఊరికి దూరంగా పడేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. మిగిలిన కూరగాయలు, పండ్లు, ఇతర ఐటమ్స్ చెడిపోకుండా కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ మార్కెట్‌లోని కళాఖండాలు ఒక పల్లె వాతావరణాన్ని తలపిస్తుంటాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ శిల్పాలను ఎంతో అపురూపంగా తయారు చేశారు.

 

మార్కెట్ నిర్మించడం వల్ల చాలా లాభాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దుకాణాలన్నీ ఒకే చోట ఉండడంతో బిజినెస్ పెరిగింది. గతంలో వ్యాపారం చెయ్యాలా వద్దా అన్న స్థాయి నుంచి ఇప్పుడు వ్యాపారంతోనే తమ బతుకులు బాగుపడ్డాయి అనుకునే స్థితికి చేరుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. 

 

మరోవైపు...వినియోగదారులకు కూడా గజ్వేల్ సమీకృత మార్కెట్‌ అనుకూలంగా ఉంది. అన్ని వెరైటీలు ఒకే చోట దొరుకుతున్నాయి. ఫ్యామిలీతో షాపింగ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఒక్కసారి లోపలికి వచ్చామంటే కావాల్సిన ఐటమ్స్‌తో బయటకి వెళ్తున్నాం అంటున్నారు వినియోగదారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: