కాంగ్రెస్ పార్టీ నేత, బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రఘ్న సిన్హా ఒక వివాహానికి హాజరు కావడం కోసం వెళ్లి పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కలిశారు. శత్రఘ్న సిన్హా అరిఫ్ తో గవర్నర్ హౌజ్ లో భేటీ అయ్యారు. అరిఫ్, శత్రఘ్న సిన్హా ఈ సమావేశంలో పాక్ భారత్ సరిహద్దులలో శాంతి నెలకొల్పాల్సిన అవసరం గురించి చర్చలు జరిపారు. అరిఫ్ కార్యాలయం ఈ చర్చలలో కశ్మీర్ ప్రస్తావన వచ్చిందని, ఇతర అంశాల గురించి కూడా వీరిద్దరూ చర్చలు జరిపారని పేర్కొంది. 
 
అరిఫ్ కార్యాలయం ఉపఖండంలో శాంతిని నెలకొల్పటానికి కృషి చేయాలని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపింది. శత్రఘ్న సిన్హా తమ మధ్య రాజకీయాల గురించి ఎటువంటి చర్చ జరగలేదని అన్నారు. సాంఘిక, సాంస్ర్కృతిక సమస్యల గురించి తమ మధ్య చర్చలు జరిగాయని శత్రఘ్న సిన్హా పేర్కొన్నారు. పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఆర్టికల్ 370 తరువాత కశ్మీర్ లో నెలకొన్న ఆంక్షల గురించి వ్యక్తం చేసిన ఆందోళనను సిన్హా అర్థం చేసుకున్నాడని అన్నారు. 
 
ఆర్టికల్ 370 రద్దు తరువాత అరిఫ్ అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ సంఘీభావ దినోత్సవంగా పేర్కొంటున్నట్టు ప్రకటన చేశారు. ఏ దశలోను కశ్మీరీలను ఒంటరి చేయం అని కశ్మీరీలు మనవాళ్లు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరిఫ్ అల్వీ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా సంస్థలు కూడా అరిఫ్ అల్వీకి అప్పట్లో ఖాతాలను బ్యాన్ చేసి షాక్ ఇచ్చాయి. 
 
మరోవైపు బీజేపీలో కొనసాగిన శత్రఘ్న సిన్హా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో నరేంద్ర మోదీ శత్రఘ్న సిన్హాకు టికెట్ నిరాకరించారని అందువలనే శత్రఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరారని వార్తలు వినిపించాయి. ఆ తరువాత శత్రఘ్న సిన్హా కాంగ్రెస్ తరపున బీహార్ లోని పాట్నా నుండి పోటీ చేశారు. గత కొంతకాలంలో వార్తల్లో పెద్దగా నిలబడని శత్రఘ్న సిన్హా పాక్ అధ్యక్షుడితో భేటీ కావడంతో వార్తల్లో నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: