ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలతో సీఎం జగన్ ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు సీఎం జగన్ విజయనగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జగన్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. అధికారులు, వైసీపీ నేతలు ఇప్పటికే విజయనగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ తొలిసారిగా విజయనగరంలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు అందించనుంది. వార్షిక ఆదాయం రెండున్నర లక్షలు, అంతకన్నా తక్కువ ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. 
 
ప్రభుత్వం రెండు విడతలుగా ఈ నగదును జమ చేయనుంది. మొదటి విడతలో ఐటీఐ విద్యార్థులకు 5000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 7500 రూపాయలు, డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు 10,000 రూపాయలు జమ చేయనుంది. జగనన్న వసతి దీవెనకు అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాలలో ఈ నగదు జమవుతుంది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 11,87,904 మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. 
 
ఈ పథకానికి అర్హులో కాదో చెక్ చేసుకోవడానికి ఆన్ లైన్ లో ఎటువంటి ఆప్షన్ లేదు. ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవాలంటే సమీపంలోని గ్రామ సచివాలయానికి వెళ్లి ఆధార్ కార్డ్ వివరాలను చెప్పి అర్హులో కాదో తెలుసుకోవచ్చు. సీఎం జగన్ ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ నుండి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడినుండి హెలీ ప్యాడ్ లో విశాఖ చేరుకుంటారు. అనంతరం అయోధ్య మైదానంలో జగన్ దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: