ప్రధాని నరేంద్ర మోదీ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ భారత్ అమెరికా మైత్రి బంధం కలకాలం వర్ధిల్లాలని చెప్పారు. నవచరిత్ర వేదికగా మొతెరా స్టేడియం నిలుస్తోందని వ్యాఖ్యలు చేశారు. నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి కొనసాగింపుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రంప్ కు మనస్పూర్తిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం స్వాగతం పలుకుతోందని మోదీ అన్నారు. 
 
అమెరికా భారత్ దేశాల మధ్య మైత్రి బంధంతో సరికొత్త అధ్యాయం మొదలైందని మోదీ అన్నారు. గుజరాత్ మాత్రమే ట్రంప్ కు స్వాగతం పలకటం లేదని యావత్ దేశం స్వాగతం పలుకుతోందని మోదీ అన్నారు. అమెరికాది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే మాది స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని మోదీ అన్నారు. ట్రంప్ కు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గౌరవంగా తాము భావిస్తున్నామని మోదీ చెప్పారు. 
 
మొతెరా మైదానం వేదికపైకి ప్రధాని మోదీ, డోనాల్డ్ ట్రంప్, మెలానియా చేరుకుని లక్షల సంఖ్యలో హాజరైన ప్రజలకు అభివాదం తెలిపారు. మోదీ, ట్రంప్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ట్రంప్ మాట్లాడుతూ భారత్ కు రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. భారత్ ఎదుగుదల ప్రపంచానికి మార్గదర్శకం అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఛాయ్ వాలాగా మొదలుపెట్టి మోదీ ప్రధాని స్థాయికి చేరుకున్నారని అన్నారు. 
 
శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనేదానికి మోదీ నిదర్శనం అని చెప్పారు. గతంతో పోలిస్తే భారత్ లో రోడ్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంతో మెరుగయ్యాయని ట్రంప్ అన్నారు. పేదరిక నిర్మూలన, పారిశుద్ధ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ తనకు నిజమైన స్నేహితుడని ట్రంప్ అన్నారు. మోదీకి ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంలో స్వాగతం పలికామని మోదీ తమకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో స్వాగతం పలికారని అన్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: