రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన  ఐదేళ్ల చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసులో దోషి రఫీకి చిత్తూరు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. 2019 సంవత్సరం నవంబర్ నెల 7వ తేదీన చిత్తూరు జిల్లా కురువలపాడు మండలం చేనేతనగర్ లో ఐదేళ్ల చిన్నారిని మహ్మద్ రఫీ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరైన చిన్నారికి మాయమాటలు చెప్పి రఫీ కిడ్నాప్ చేశాడు. 
 
ఆ తరువాత చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు.  పెళ్లిలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు మహ్మద్ రఫీని అరెస్ట్ చేశారు. 
 
మహ్మద్ రఫీ అత్యాచారం చేసి హత్య చేసిన తరువాత గుండు చేయించుకొని ఛత్తీస్ గఢ్ కు పారిపోయాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేసి 17 రోజులలోనే ఛార్జీషీటు కూడా దాఖలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పగడ్భందీగా సాక్ష్యాలు ఉంచిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధించారు. 
 
ఈ తీర్పును హైకోర్టును పంపించి ఆ తరువాత ఉరిశిక్ష తేదీని ఖరారు చేస్తామని కోర్టు తెలిపింది. డీఎస్పీ ఈ తీర్పు గురించి మాట్లాడుతూ ఈ కేసును తాము ప్రత్యేకమైనదిగా భావిస్తున్నామని ఐదు సంవత్సరాల పాపని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితునికి ఉరిశిక్ష పడిందని కోర్టు ముందు ఉన్న సాక్ష్యాలు బలంగా ఉండటం వలన కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని అన్నారు. 100 రోజుల్లో నిందితునికి శిక్ష పడటంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: