అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆగ్రాలో పర్యటిస్తున్నారు. ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో కలిసి 4.30 గంటలకు ఆగ్రా చేరుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్, యూపీ గవర్నర్ అనందీబెన్ పాటిల్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా వాయిద్యాలు, నృత్యాలతో కళాకారులు చేసిన ప్రదర్శనను ట్రంప్ ఆసక్తిగా తిలకించారు. 
 
రహదారి వెంట దాదాపు 25,000 మంది విద్యార్థులు భారత్ - అమెరికా జెండాలతో ట్రంప్ కు స్వాగతం పలికారు. ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ మహల్ ను వీక్షించారు. తాజ్ మహల్ దగ్గర ఉన్న సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాశారు. తమ కోసం నియమించిన ప్రత్యేకమైన గైడ్ ద్వారా ట్రంప్ దంపతులు తాజ్ మహల్ విశేషాలను తెలుసుకున్నారు. భారత్ పర్యటనలో ఎక్కడ చూసినా తనకు ఘనస్వాగతం లభిస్తూ ఉండటం పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
తమపై భారతీయులు చూపుతున్న ఆదరాభిమానులకు ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ హిందీలో " తాను, అమెరికా ప్రథమ మహిళ భారతదేశంలోని ప్రతి పౌరుడికి సందేశం ఇవ్వటానికి 8000 మైళ్ల దూరం ప్రయాణించాం. అమెరికా భారతదేశాన్ని గౌరవిస్తుంది... ప్రేమిస్తుంది.. అమెరికా ప్రజలు భారత ప్రజలకు ఎల్లప్పుడూ హృదయపూర్వక స్నేహితులుగా ఉంటారు" అని ట్వీట్ చేశారు. 
 
భారత పర్యటనకు బయలుదేరిన సమయంలో కూడా ట్రంప్ హిందీలో ట్వీట్ చేశారు. " మేము భారత్ కు రావాలని ఎదురు చూస్తున్నాం. కొద్ది గంటలలో అందరినీ కలుస్తాం." అని పేర్కొన్నారు. మరోవైపు భారత్ లో ట్రంప్ పర్యటన నేపథ్యంలో అధికారులు కశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేయటంతో పాటు అదనపు బలగాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: