ఏపీ, తెలంగాణ మధ్య వివాదానికి కారణమైన విద్యుత్ ఉద్యోగుల సమస్య కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాలు జస్టిస్ ధర్మాధికారి ముందు వాదనలు వినిపించాయి. రెండు రాష్ట్రాల వాదనలు విన్న జస్టిస్ ధర్మాధికారి త్వరలోనే ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. 

 

సుప్రీంకోర్టు ఆదేశానుసారం తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల పంపిణీపై జస్టిస్ ధర్మాధికారి ముందు ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు సరిగా లేవని ఏపీ వాదించింది. మరో కమిటీకి అప్పగించాలని కోరింది. తెలంగాణ నుంచి ఉద్యోగులను పంపిస్తున్నారే తప్పా ఏపీ నుంచి ఏ ఉద్యోగిని తెలంగాణకు కేటాయించలేదని ఏపీ.. కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది.ఇది ఏపీకి ఆర్థికంగా భారంగా మారుతోందని తెలిపింది.

 

ఏపీ వాదన అసమంజసంగా ఉందని తెలంగాణ వాదించింది. తెలంగాణకు 505 మందిని జస్టిస్ ధర్మాధికారి కేటాయించారని.. దీనికి తోడు ఏపీ నుంచి వచ్చిన 242 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులను విద్యుత్ సంస్థలు విధుల్లోకి తీసుకున్నాయని వివరించారు. ఏపీలో ఖాళీలున్నా తీసుకోవడంలేదని.. ఉద్యోగుల విషయంలో ఆర్థికభారం అనడం సరికాదని తెలంగాణ అధికారులు తెలిపారు. 655 మంది ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థలు విధుల్లోకి తీసుకోవాలని ధర్మాధికారి కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. ఆర్డర్ రిజర్వ్ చేశామని.. వారంలో విడుదల చేస్తామని ధర్మాధికారి చెప్పారన్నారు.

 

వారంలోగా సమస్య పరిష్కారమవుతుందని రిలీవైన ఉద్యోగుల సంఘం ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల విభజన అంశాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించాలని జస్టిస్ ధర్మాధికారి చెప్పారు. డిసెంబర్‌లో 655 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అదనపు ఉత్తర్వులను వారంలోగా జారీ చేస్తామన్నారు. ఇరు రాష్ట్రాలు మొండిపట్టుదలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: