ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) త‌న పంజా విసురుతోంది.  జపాన్‌ తీరంలో నిలిపి ఉంచిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ఉన్న భార‌తీయుల విష‌యంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా మరో నలుగురు భారతీయులు ఈ కరోనా వైరస్‌ బారిన పడినట్టు జపాన్‌లోని భారత దౌత్యకార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఓడలో కరోనా వైరస్‌ సోకిన భారతీయుల సంఖ్య 12కు చేరింది.

 

గత వారం డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి ఓ 60 ఏళ్ల‌ జపాన్‌ మహిళకు వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్య అధికారులు అనంతరం విడుదల చేశారు. అయితే, ఇంటికి చేరుకున్న సదరు మహిళ అనారోగ్యం పాలవడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు తేలింది. ఇలాగే నౌక నుంచి విడుదలైన మరో 20 మంది విదేశీయుల్లో కూడా వైరస్‌ లక్షణాలు గుర్తించామని అధికారులు తెలిపారు. దీంతో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో నిర్వహించిన కరోనా పరీక్షల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాధి లక్షణాలు లేవని చెబుతూ నౌక నుంచి అధికారులు విడుదల చేసిన కొందరు ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తుండ‌గా....అందులో ఉన్న భార‌తీయుల‌పై సైతం అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

 

కాగా,కోవిడ్‌19 వ్యాప్తి అదుపులోకి వ‌చ్చింది.  కరోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన హుబేయ్ ప్రావిన్సులో ఆ వ్యాధి కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌ట్టింది. చైనా జాతీయ ఆరోగ్య క‌మిష‌న్ ఈ విష‌యాన్ని చెప్పింది. ఎన్‌హెచ్‌సీ ప్ర‌తినిధి మీ ఫెంగ్ ఇవాళ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. వ‌రుస‌గా నాలుగో రోజు  కొత్త‌గా న‌మోదు అవుతున్న కేసులు క‌న్నా..  వ్యాధి న‌య‌మైన కేసులు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు.  వుహాన్ న‌గ‌రం త‌ప్ప.. ఈ మార్పు ఆ ప్రావిన్సులో క‌నిపిస్తున్న‌ట్లు చెప్పారు. ప‌టిష్ట‌మైన నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల హుబేయ్ ప్రావిన్సులో కోవిడ్‌19 కేసులు త‌గ్గిన‌ట్లు పేర్కొన్నారు.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: