హైద‌రాబాద్‌కు దాంతో పాటుగా సికింద్రాబాద్‌కు కూడా రైల్లో వెళ్లేవారికి ఓ ఉప‌శ‌మ‌నం, గుడ్ న్యూస్ కూడా. ఇప్పటికే సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు వచ్చే రైళ్ల రాకపోకల వల్ల మూడు స్టేషన్లకు ఇబ్బంది ఎదురవుతున్నది. గంట‌ల కొద్ది నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు. అయితే, నగరంలోని సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లలో రైళ్లు, ప్రయాణికుల భారం పడకుండా నిర్మించ తలపెట్టిన శాటిలైట్‌ రైల్వే టెర్మినల్స్‌లో చర్లపల్లి ముందుగా అందుబాటులోకి రానున్నది. దీనికోసం ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి.

 


చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులను రెండు దశలుగా చేపట్టనున్నారు. వీటికి టెండర్లు కూడా ఫైనల్‌ చేశారు. ఫేజ్‌-1లో భాగంగా రూ.54.58 కోట్ల పనులు, రెండో దశలో రూ.62.67 కోట్లతో పనులు చేపట్టనున్నారు. రెండు సంవత్సరాల కాల పరిమితితో రెండు దశలు పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నారు. రూ.221 కోట్లతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ఈ టెర్మినల్‌ నిర్మించడానికి భూసేకరణ ఇబ్బందిగా మారింది. 200 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ కేవలం 50 ఎకరాల భూమి మాత్రమే సేకరించడం పూర్తయింది. భూసేకరణ క్లిష్టతరం కావడంతో సేకరించిన భూమిలోనే స్టేషన్‌ను పూర్తి చేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇందుకుగాను రూ.117.25 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్లు ఫైనల్‌ చేసింది. దీనివల్ల భాగ్యనగర ప్రజలకు రవాణా సౌకర్యం మరింత దగ్గర కానున్నది. 

 

 

కాగా, అవుటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వస్తుండడంతో పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు సులువుగా ఉండనున్నది. కేవలం అవుటర్‌ రింగ్‌రోడ్డుకు 8 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తుండడంతో అవుటర్‌ మీదుగా నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకునే సదుపాయం ఉంటుంది. అయితే చాలా రైళ్లను ఇక్కడి నుంచే ఆపరేట్‌ చేసేందుకు రైల్వే నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టనున్న ప్రైవేటు రైళ్లను కూడా ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆపరేట్‌ చేయనున్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌, సనత్‌నగర్‌, యాదాద్రి వరకు సబర్బన్‌ రైళ్లు నడువనుండడంతో ఈ టెర్మినల్‌లో దిగిన ప్రయాణికులకు సబర్బన్‌ రైళ్ల ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: