కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం విష‌యంలో ఇంకా ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు ఈ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామ‌ని, ఈ మేర‌కు రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో అసెంబ్లీ తీర్మానం చేస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ ప్ర‌క‌ట‌న వెంట‌నే అన్నారు. తాజాగా ఆయ‌న మ‌రోమారు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

 


ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్పీఆర్‌, ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన  మాట్లాడుతూ మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తల్లిని, బిడ్డను వేరు చేసే కర్కశ చట్టాల‌ని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పౌరుల జాతీయ రిజిస్టర్‌ (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజ్ఞప్తిచేశారు. కేరళ తరహాలో తెలంగాణలో కూడా ఎన్పీఆర్‌పై స్టే విధించి ఎన్నార్సీ (పౌరుల జాతీయ రిజిస్టర్‌)ని అడ్డుకోవాలని, దీనిపై సీఎం కేసీఆర్‌, హోంమంత్రి మహమూ ద్‌ అలీ ప్రజామోదమైన నిర్ణయం తీసుకోవాలని, ఎన్నో ఏండ్లుగా భారత్‌ను నమ్ముకున్న ముస్లింల పౌరసత్వం రద్దుకు జరుగుతున్న కుట్రను ఆపాలని కోరారు. బరేలిలో 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న షబానా..  తన వద్ద ఉన్న గుర్తింపు కార్డులతో భారత మహిళగా నిరూపించుకోలేకపోవడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 

 


కాగా, ఓవైసీ స‌భ‌లో క‌ల‌క‌లం రేగిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాటకలోని బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్న నిరసన సభలో ఓ యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అన్న పేరుతో గ‌త‌ గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదికపైకి వచ్చిన సదరు యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేయడంతో ఒవైసీ వెంటనే అప్రమత్తమై ఆమె నుంచి మైకును లాక్కున్నారు. ఆ యువతి చర్యను ఖండించిన ఆయన, తనకు లేదా తన పార్టీకి ఆమె వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తామంతా భారత్‌ వైపే ఉంటామని, శత్రు దేశమైన పాక్‌కు ఎప్పుడూ మద్దతు ఇవ్వబోమన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: