అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు నిన్న ఆగ్రా పర్యటనలో ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను సందర్శించారు. తన పర్సనల్ విజిట్ లో భాగంగా ట్రంప్ దంపతులు తాజ్ మహల్ పర్యటనకు వచ్చారు. తాజ్ మహల్ ను చూసి మంత్ర ముగ్ధులైన ట్రంప్ దంపతులు తాజ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చారిత్రక కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రభుత్వం ట్రంప్ దంపతుల కోసం ప్రత్యేకంగా ఒక గైడ్ ను నియమించింది. 
 
గైడ్ నితిన్ కుమార్ సింగ్ ట్రంప్ దంపతులకు తాజ్ మహల్ చరిత్రను, విశిష్టతను వివరించారు. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ గైడ్ ను కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాలను గైడ్ నితిన్ మీడియాకు వెల్లడించారు. మెలానియా ట్రంప్ తనను మడ్ ప్యాక్ చికిత్స వివరాలను అడిగారని ఆ వివరాలను తెలుసుకున్న సమయంలో మెలానియా ట్రంప్ ఆశ్చర్యపోయిందని చెప్పారు. 
 
ట్రంప్ దంపతులు తాజ్ మహల్ ను చూసిన వెంటనే ఆశ్చర్యానికి లోనయ్యారని అద్భుతం అంటూ ప్రశంసించారని నితిన్ చెప్పారు. మరోసారి తాజ్ అందాలను వీక్షించడానికి వస్తామని ట్రంప్ దంపతులు చెప్పారని అన్నారు. ట్రంప్ షాజహాన్, ముంతాజ్ ప్రేమకథ విన్న సమయంలో ఉద్వేగానికి లోనయ్యారని నితిన్ చెప్పారు. తాను తాజ్ మహల్ కథ, నిర్మాణం చెప్పానని వాస్తు శిల్పం, డిజైన్ వివరాలను చెప్పే సమయంలో ట్రంప్ దంపతులు చాలా ఆసక్తి చూపించారని అన్నారు. 
 
నిన్న అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగిన తరువాత ట్రంప్ దంపతులు ప్రత్యేక విమానంలో ఆగ్రాకు చేరుకున్నారు. తాజ్ అందాలను, నిర్మాణ కౌశలాన్ని, పరిసరాలను చూసిన ట్రంప్ దంపతులు పులకరించిపోయారు. సూర్యాస్తమయంలో తాజ్ అందాలను వీక్షించిన ట్రంప్ దంపతులు దాదాపు 60 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: