జనసేన తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు చుక్కలు చూపిస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుండి గెలిచిన రాపాక ఏరోజు కూడా పార్టీ ఎంఎల్ఏగా వ్యవహరించింది లేదు. అలాంటి రాపాక పార్టీ కార్యక్రమాల్లో కన్నా అధికార వైసిపి కార్యక్రమాలు, అధికార పార్టీ నేతలతోనే ఎక్కువగా సన్నిహితంగా కనిపిస్తున్నాడనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దాంతో తన ఎంఎల్ఏను ఎలా కట్టడి చేయాలో అర్ధంకాక పవన్ తల పట్టుకున్నాడు.

 

రాపాక తాజా వ్యవహారశైలికి ఓ రకంగా పవనే కారణమని చెప్పాలి. ఎందుకంటే పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. ఇంకేదైనా పార్టీలో ఈ పరిస్ధితుంటే నియమించే ప్రతి కమిటిలోను ఆ ఎంఎల్ఏకి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ రాపాక విషయంలో మాత్రం పవన్ పెద్ద తప్పే చేశాడు. పార్టీ తరపున నియమించిన పొలిట్ బ్యూరోలో లేడు. ఏదో ఓ కమిటిలో మొక్కబడిగా సభ్యునిగా నియమించటం తప్ప  చాలా కమిటిల్లో అసలు సభ్యత్వమే ఇవ్వలేదు.

 

పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏకి అధినేతే ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంఎల్ఏకి మాత్రం ఏముంటుంది ? అందుకనే పార్టీ దారి పార్టీది ఎంఎల్ఏ దారి ఎంఎల్ఏదిగా అయిపోయింది. చివరకు పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ చేస్తున్న పర్యటనల్లో కూడా రాపాక ఎక్కడా కనబడటం లేదు. పైగా అధికారపార్టీ నేతలు  నిర్వహించిన కార్యక్రమాల్లో రాపాక ఎక్కువగా కనిపిస్తున్నారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే వైసిపి కార్యక్రమాల్లో, నేతలతో కనిపిస్తున్న రాపాకను కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాగని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా సాధ్యం కావటం లేదు. ఎందుకంటే దళిత ఎంఎల్ఏలపై పవన్ చర్యలు తీసుకున్నాడంటూ గోల మొదలుపెడితే దాన్ని తట్టుకోలేడు. అందుకనే ఏమి చేయాలో తెలీక తల పట్టుకుని కూర్చున్నాడు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: