వారంతా టీడీపీ నేత‌లు. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. టీడీపీ త‌మ్ముళ్లు. పార్టీ అంటే ఎన‌లేని గౌర‌వం ఉంది. అధినేత చంద్ర‌బాబు అంటే.. అమిత‌మైన భ‌క్తి ప్ర‌ప‌త్తులు కూడా ఉన్నాయి. ఆయ‌నంటే.. వారికి మ‌రోరూపంలో క‌నిపించే దేవుడు కూడా! బాబు ఒక్క మాట అంటే.. వారికి వేదంతో స‌మానం. ఆయ‌న మాట మీరాలంటేనే ఒణుకు. అలాంటి నాయ‌కులు ఎప్పుడూ కూడా పార్టీలైన్‌ను దాటి ప్ర‌వ‌ర్తించింది లేదు. చంద్ర‌బాబును విమ‌ర్శించింది కూడా లేదు. అయితే, ఇప్పుడు వారే ఒక్క‌మాట అంటున్నారు.. అదే.. ``బాబూ నీకో న‌మ‌స్కారం``-అని! ఆశ్చ‌ర్యంగాఅనిపించినా ఇది నిజ‌మ‌ని పార్టీలోని సీనియ‌ర్లు కూడా గొణుక్కుంటున్నారు.



మ‌రి ఇంత‌గా పూజించే బాబును వారు ఎందుకు ఇలా న‌మస్కారం పెడుతున్నారు. అస‌లు ఏం జ‌రుగుతోంది ?  ఇప్పుడు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌. కొంచెం లోతుల్లోకి వెళ్లి ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు అధికారం కోల్పోయాక తొలి రెండు నెల‌లు ఈ ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించి సైలెంట్ అయ్యారు. ఆ వెంట‌నే పుంజుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. ఈ క్ర‌మంలోనే అనేక నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు అంటూ నెల‌కో కార్య‌క్ర‌మంతో రోడ్ల మీద‌కు వ‌చ్చారు. అయినా కూడా పార్టీ నేత‌లు ఎవ‌రూ బెంబేలెత్త‌లేదు. బాబు పిలుపు అందుకుని ఆయ‌న చెప్పిన‌ట్టే న‌డుచుకున్నారు. నిర‌స‌నల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆందోళ‌న‌లు చేశారు.



ఇసుక నుంచి రాజ‌ధాని వ‌ర‌కు అంద‌రూ గొంతు క‌లిపారు. అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన ఓ కార్య‌క్ర‌మం వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. దీంతో బాబూ నీకో న‌మ‌స్కారం అంటున్నారు. తాజాగా చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చేస్తున్న యుద్ధంలో భాగంగా ``ప్ర‌జా చైత‌న్య యాత్ర‌`` చేస్తున్నారు. దీనిని గ‌త శుక్ర‌వారం ఆయ‌న ప్ర‌కాశం జిల్లాలో ప్రారంభించారు. ఆదిలో అంద‌రూ కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని లైట్ తీసుకున్నారు. అయితే, దీనికి సంబంధించిన విధివిధానాలను టీడీపీ కార్యాల‌యం జిల్లాల‌కు పంపింది. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించిన విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.



ఈ క్ర‌మంలో ఈ యాత్ర‌కు అయ్యే ఖ‌ర్చును నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జులే భ‌రించాల‌ని చెప్ప‌డం ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది.  అధికారం కోల్పోయిన నేపథ్యంలో తమ జేబుల్లో నుంచి తీసి ఖర్చు ఎందుకు చేయాలనే భావనలో ఉన్నట్టు సమాచారం. అందులోనూ బలవంతంగా జనసమీకరణ చేయాల్సి రానుండటంతో ఖర్చు కొంచెం ఎక్కవే చేయాల్సి వస్తుందని వారంతా భావిస్తున్నారు. దీంతో బాబూ నీకో న‌మస్కారం.. ఇప్పుడు మాద‌గ్గ‌ర అంత డ‌బ్బులేదు. ఈ యాత్ర పేరుతో మ‌మ్మ‌ల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ వేడుకుంటున్నార‌ట‌. ఇదే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి బాబు త‌మ్ముళ్ల గోడును వింటారో.. లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: