అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు పర్యటనలో భాగంగా నిన్న ఉదయం మోతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. దాదాపు లక్షా పాతికవేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగంలో భారతీయ సినిమాలు, పండుగలు, ప్రముఖుల పేర్ల గురించి ప్రస్తావించారు. కొన్ని పేర్లను పలకడంలో ట్రంప్ తడబడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్ ను ట్రోల్ చేస్తున్నారు. 
 
ట్రంప్ స్వామి వివేకానంద పేరును వివేకా ముంద అని, చాయ్ వాళాను చీవాలా అని, వేదాలను వేస్టాస్ అని ప్రసంగించారు. ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లను ట్రంప్ తప్పుగా ఉచ్చరించారు. ట్రంప్ క్రికెటర్ల పేర్లను సరిగ్గా పలకకపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తూ వాటిని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు టీమిండియా క్రికెటర్లు పేర్లు ట్రంప్ నోటి నుండి రావడంపై ఆనందం వ్యక్తం చేయగా మరికొందరు తప్పుగా ఉచ్చరించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్రంప్ తన ప్రసంగంలో సచిన్ టెండూల్కర్ పేరును సుచిన్ టెండూల్కర్ అని విరాట్ కొహ్లీ పేరును విరాట్ కోలీ అని ఉచ్చరించారు. ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఇదే విషయం గురించి ట్రంప్ పై విమర్శలు చేశారు. పీటర్సన్ ట్రంప్ కు లెజెండ్స్ పేర్లను పలికే సమయంలో తగిన రీసెర్చ్ చేయాలని సూచనలు చేశారు. ఐసీసీ కూడా ట్రంప్ పై విమర్శలు చేసింది. ఐసీసీ అభిమానులను " sach, such, satch, sutch, sooch, లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా...?" అని ప్రశ్నించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐసీసీ, పీటర్సన్ చేసిన ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: