ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే నరేంద్రమోడిలో ఎంతగా కసి పేరుకుపోయిందో తాజా ఉదాహరణే వివరిస్తోంది. రెండు రోజుల భారత్ పర్యటనల్లో భాగంగా అగ్రరాజ్యం అమెరికా  అధినేత డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఓ స్కూల్ ను సందర్శించారు. మొన్నటి కేజ్రీవాల్ సాధించిన ఘన విజయంలో హ్యాపీనెస్ స్కూల్ పథకం కూడా చాలా కీలకమనే చెప్పాలి. కేజ్రీవాల్ ప్రారంభించిన ఈ పథకం అమెరికా ప్రధమ మహిళ మెలానియా దృష్టినే ఆకర్షించిందంటేనే పథకం ఎంతగా పాపులరైందో అర్ధమైపోతోంది.

 

ఇలాంటి స్కూల్ పథకం అమలును ప్రత్యక్షంగా చూడాలని, విద్యార్ధులతో ఇంటరాక్ట్ అవ్వాలని మెలానియా చాలా ఉత్కంఠంగా ఎదురు చూసింది. దాంతో ట్రంప్ దంపతుల పర్యటనలో స్కూల్ ను సందర్శించే విషయంలో  మెలానియా  ప్రత్యేకంగా సమాయాన్ని కేటాయించారు. ఇందులో భాగంగానే ఆమె ఈరోజు  సర్వోదయా స్కూల్ కు వెళ్ళి దాదాపు గంటసేపు గడిపారు. విద్యా విధానం గురించి టీచర్లు, పిల్లలతో మాట్లాడారు. 

 

నిజానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవటంలో  కేజ్రీవాల్ ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఢిల్లీ మొత్తం బడ్జెట్లో సుమారు 24 శాతం విద్యా రంగానికే ఖర్చు చేస్తోందట. ఇందుకనే ఇంతటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కేజ్రీవాల్ నిర్ణయం వల్ల కొన్ని వేల స్కూళ్ళ రూపురేఖలే మారిపోయాయి. ఏ ప్రభుత్వ స్కూల్ ను తీసుకున్నా కార్పొరేట్ స్కూల్ కు తీసిపోని విధంగా ఉంటుంది.

 

ఇలాంటి స్కూల్ ను మెలానియా సందర్శిస్తున్నపుడు ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఉంటాడని అనుకుంటారు. కానీ తాము అమలు చేస్తున్న పథకం,  విద్యావ్యవస్ధ గురించి వివరించే అవకాశం సిఎంకు రాలేదు. ఎందుకనంటే కేజ్రీవాల్ ను మోడి దూరంగా పెట్టేశాడు. కేజ్రీవాల్ దెబ్బకు మొన్నటి ఎన్నికల్లో మోడి తల బొప్పికట్టిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో కేజ్రీవాల్ మీద మోడి  కక్ష పెంచుకున్నట్లుగా ఉంది. అందుకనే ఫక్తు రాజకీయ నాయకునిగానే మోడి వ్యవహరిస్తున్నాడు కానీ ఓ పెద్దమనిషి తరహా ఎక్కడా మోడిలో కనిపించ లేదు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: