తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డొస్తే ఎవరినైనా  ఖతం చేస్తాం అనే రేంజ్ లో చెలరేగుతోంది. ఇసుక దందా ఎలా ఉందంటే.. తమ లొసుగులు కనిపెట్టేస్తున్నారనే అనుమానం వస్తే.. చాలు తనవాళ్లా, పరాయివాళ్లా అని కూడా చూడకుండా లేపేసే పనిలో పడింది ఇసుక మాఫియా. చాలా ప్రాంతాల్లో ఇసుక మాఫియా ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. 

 

సిద్దిపేట జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ ఇసుక దందా పై పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే అనుమానంతే శ్రీకాంత్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్యచేశాడు నిందితుడు శ్రీనివాస్‌. హుస్నాబాద్ మండలంలోని ఎల్లమ్మ చెరువుకట్టపై ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం నిందుతుడు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. వల్లపు శ్రీనివాస్‌ తాగిన మత్తులో శ్రీకాంత్‌ను బీరు సీసాతో పొడిచి చంపాడు. అయితే శ్రీనివాస్‌తో పాటు మరో ఎనిమిది మంది కలిసి శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇసుక మాఫియాకు అడ్డొస్తున్నాడనే ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు శ్రీకాంత్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా హత్యకు గురికావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

 

అటు కడప జిల్లాలోనూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కీలక నేతలే అండదండలు అందిస్తుంటంతో.. వాళ్ల ఇష్టారాజ్యం అయిపోయింది. కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గ నుంచి ప్రొద్దుటూరు దాకా పెన్నా నది పరీవాహక ప్రాంతం ఉంది. గండికోట ప్రాజెక్టు పుణ్యమా అని భారీగా ఇసుక నిల్వలున్నాయి. దీంతో అక్రమార్కులు చెలరేగుతున్నారు. ట్రాక్టర్ కు ఓ రేటు, టిప్పర్ కు మరో రేటు పెట్టి టోకుగా దోచుకుంటున్నారు. 

 

జమ్మలమడుగు నియోజకవర్గంలో  కొండాపురం మండలం ఏటూరులో అధికారికంగా ఇసుక డంప్ ఉంది. అయితే ఇక్కడ్నుంచే అక్రమ దందా సాగుతోంది. ఒక ఇసుక బిల్లు మాటున మూడు ట్రిప్పుల ఇసుక‌ను తీసుకెళుతూ సొమ్ము చేసుకుంటున్నారు.  కీలక నేతలు చక్రం తిప్పుతుండటంతో.. అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇక్కడి ఇసుక తాడిపత్రి, ముద్దనూరు, జమ్మలమడుగుతో పాటు సాక్షాత్తూ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా తరలిపోతోంది. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే.. అక్రమార్కులు మరింత తెగించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: