ఏపీలో అధికార వైసీపీ అధికారంలోకి వ‌చ్చి యేడాది కావొస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ నాయ‌కుల‌కు సీరియ‌స్‌గా వార్నింగ్ ఇవ్వ‌డంతో నేత‌లు అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ప‌ద‌వుల కోసం నాయ‌కుల మ‌ధ్య విబేధాలు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ అస‌మ్మ‌తిని చ‌ల్చార్చ‌డం పార్టీ అధిష్టానం వ‌ల్ల కూడా కావ‌డం లేదు. క‌ర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, అదే జిల్లాలో క‌ర్నూలు ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహ‌న్ రెడ్డి మ‌ధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి.



ఇక గుంటూరు జిల్లాలో న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం న‌డుస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తో సైతం విడ‌ద‌ల ర‌జ‌నీకి ప‌డ‌డం లేదు. ఇక దీనికి తోడు అదే జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవితో సైతం ర‌జ‌నీకి పొస‌గ‌డం లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ క‌వురు శ్రీనివాస్‌కు ప‌డ‌డం లేదు.



ఇక తూర్పు గోదావ‌రి జిల్లాకు కూడా ఇప్పుడు ఈ గ్రూపు విబేధాలు పాకాయి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. మాజీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు వర్గానికి పెదపాటి అమ్మాజీ వర్గానికి మధ్య వివాదాలు ముదురుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో బొంతు రాజేశ్వ‌ర‌రావు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద రావు చేతిలో ఓడిపోయారు. ఇదే రాజేశ్వ‌ర‌రావు 2014లో సైతం టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్ల‌ప‌ల్లి సూర్యారావు చేతిలో ఓడిపోయారు.



వ‌రుసగా రెండుసార్లు ఓడిపోవ‌డంతో జ‌గ‌న్ రాజేశ్వ‌ర‌రావును నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాల నుంచి త‌ప్పించేశారు. దీంతో అమ్మాజీ కొత్త ఇన్‌చార్జ్‌గా రావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు తీవ్రంగా ముదిరాయి. దీంతో బొంతు వర్గీయులు తాటిపాక సెంటర్‌లో సమావేశమై ... తిరిగి ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలంటూ వైస్సార్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తూ.. పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్న వారికి పెదపాటి అమ్మాజీ పదవులు కట్టబెడుతున్నారని రాజేశ్వరరావు వర్గం ఆరోపిస్తుంది. మ‌రి ఈ వివాదం ఎలా మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: