ఇటీవల జరిగిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా జాతీయ పార్టీలను సైతం చిత్తు చేస్తూ సంచలన విజయాన్ని  నమోదు చేసింది. అయితే మూడవసారి ఢిల్లీ ప్రజలందరూ ఆమ్ఆద్మీ పార్టీని నమ్మి కేజ్రీవాల్ ను  ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ముఖ్యంగా కేజ్రీవాల్ పథకాలు అనే చెప్పాలి. కేజ్రీవాల్ పథకాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మొహాల్ల క్లినిక్. ఢిల్లీలోని డెబ్భై నియోజకవర్గాల్లో  ఏడాది క్రితం ప్రారంభించిన మొహల్లా  క్లినిక్  ఎంతో విజయవంతమయ్యాయి. కాగా ఈ క్లినిక్ల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల పైన కూడా కనిపించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రజలందరూ మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ మెజార్టీని కట్టబెట్టి అధికారంలోకి వచ్చేలా చేసారు. 

 

 

 ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కూడా ఆ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరిచే లక్ష్యంతో... త్వరలో వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ప్రారంభించేందుకు జగన్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జగన్ అన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... విలేజ్ క్లినిక్ లను కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు అని వైసిపి వర్గాలు అంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 

 

 

 అయితే ప్రతి క్లినిక్ లో ఓ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్జువేట్  ఓ ఏఎన్ఎం ను ప్రజలకు వైద్యం అందించేందుకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామ వాలంటీర్ లను ఎంపిక చేసినట్లు గానే వీరిని కూడా స్థానిక గ్రామాల నుండి ఎంపిక చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రభుత్వం ఎంపిక చేసిన ఇద్దరు 24 గంటల పాటు సదరు గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరి కొత్త నిబంధనలను తీసుకురానుంది జగన్ సర్కారు. ఒకవేళ అవసరం అయితే ప్రభుత్వం తరఫున వీరికి ఆ వసతి కూడా కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో... ఈ వైయస్సార్ క్లినిక్లు ప్రారంభించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: