తమిళనాట గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన కుమార్తె విద్యారాణి బీజేపీలో చేరడంతో తమిళనాట రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. తన తండ్రి చేసింది తప్పే అయినా ఇప్పటికీ ఆయన హీరోనే అంటూ ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఆయన తండ్రి ఆశయసాధన కోసమే బీజేపీలో చేరినట్లు విద్యారాణి ప్రకటించారు.  

 

వీరప్పన్... ఈ పేరు తెలియని వారుండరు. కలప స్మగ్లింగ్‌ మొదలు సినీ ప్రముఖులను కిడ్నాప్ చేసే వరకు సాగిన వీరప్పన్ అరాచకాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గజగజలాడించాయి. ఆయనను  పట్టుకునేందుకు తమిళనాడు సర్కార్‌ ఆపరేషన్ కకూన్‌ చేపట్టింది. 13 ఏళ్లపాటు ఈ ఆపరేషన్ నడిచింది. దీనికి వంద కోట్లకు పైగా ఖర్చయింది. భారతదేశంలో అత్యంత ఖర్చయిన ఆపరేషన్ ఇదే! చివరకు 2004 అక్టోబర్ 18న వీరప్పన్  హతమయ్యాడు. 

 

వీరప్పన్‌, ముత్తులక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిప్రస్తుతం మైసూర్ జైల్లో ఉంది. జామీనుపై విడుదలకు సహకరించాల్సిందిగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వేడుకుంటోంది. తన భర్త ఎప్పుడో చే శాడని చెబుతున్న నేరానికి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

 

వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి తాజాగా బీజేపీలో చేరారు. వీరప్పన్ చనిపోయేనాటికి ఆమె వయస్సు 14 ఏళ్లు. తల్లి ముత్తులక్ష్మిని కూడా కేసులు వెంటాడటంతో.. చెల్లెలు ప్రభతో కలిసి ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ విద్య తన చదువు కొనసాగించింది. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన విద్య.. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే, మరోవైపు సామాజిక కార్యకర్తగానూ పనిచేస్తూ వచ్చారు. ఒకప్పుడు వీరప్పన్ హవా కొనసాగిన గ్రామాల్లోని పేదల సమస్యలపై విద్య తనదైన శైలిలో పోరాటాలు చేస్తున్నారు. 2011లో విద్యారాణి.. మరియ దీపక్ అనే యువకుణ్ని రహస్యంగా పెళ్లిచేసుకుంది. దానికి తల్లి అడ్డుచెప్పడంతో ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో పెద్దకూతురు మెల్లగా తల్లికి దూరమైపోయింది. అప్పటి మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో విద్య-దీపక్ పెళ్లికి చట్టబద్ధత ఏర్పడింది. ఆ సందర్భంలో తల్లిని ఉద్దేశించి విద్య తీవ్ర విమర్శలు చేశారు.

 

సుమారు 3వేల మంది అనుచరులతో కలిసి విద్యారాణి బీజేపీలో చేరారు. కృష్ణగిరి జిల్లా కేంద్రంలో తమిళనాడు వ్యవహారాల ఇన్ చార్జిగా మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాక్రిష్ణన్‌ విద్యారాణికి కండువా కప్పి ఆహ్వానించారు. పలువురు వీరప్పన్ అనుచరులు విద్యారాణి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా విద్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు తన తండ్రి వీరప్పన్ ఎంచుకున్న మార్గం ముమ్మాటికీ తప్పేనన్నారు. అయితే చివరిశ్వాస వరకూ ఆయన పేదల కోసమే బతికారని గుర్తు చేశారు. ఇప్పటికీ కొన్ని వందల గ్రామాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయంటే.. నాన్న ఎలాంటివారో అర్థంచేసుకోవచ్చని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు, అడవిబిడ్డలు బాగుండాలన్న తన తండ్రి లక్ష్యాన్ని సాధించడానికే బీజేపీలో చేరుతున్నట్టు విద్యారాణి ప్రకటించారు.

 

 వీరప్పన్ పట్ల ఉన్న ప్రజల్లో ఉన్న సానుభూతిని చూసి ఆయన భార్య ముత్తులక్ష్మీ 2006లోనే రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓడిపోయారు. 2018లో 'మాన్ కక్కుమ్ వీరతమిళ పెరమైపు' పేరుతో ఉద్యమ సంస్థను ఏర్పాటుచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: