దేనికైనా ఓ టైమింగ్ అంటూ ఉంటుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా అధికారం కోసం పోరాడిన వైసీపీ ఎట్టకేలకు తొమ్మిది నెలల క్రితం దాన్ని సాధించింది. అధికార పీఠం అందుకుంది. అయితే ఆ పార్టీలో సీనియర్లు కాస్త తక్కువ. అందులోనూ మొదటి సారి మంత్రులు అయిన వారూ ఎక్కువే. అయితే ఇప్పటి వరకూ వైసీపీ నాయకుల్లో ఓ ట్రెండ్ నడిచింది. అదేంటంటే.. ప్రతి విషయానికీ చంద్రబాబు పరిపాలనను తిట్టడం.

 

అయితే ఇప్పుడు ఆ టైమ్ దాటిపోయిందనే చెప్పాలి.. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో దోపిడీ చేశాడని వైసీపీ నేతలు తరచూ చేసే ఆరోపణ. అమరావతి పేరుతో అభివృద్ధి పేరుతో ప్రజలకు శఠగోపం పెట్టాడని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించాడని.. ఇలా చాలా చాలా చెబుతూ వచ్చారు వైసీపీ నాయకులు. అలా చెప్పడం వారికి ఓ అలవాటుగా మారింది. వాస్తవానికి చంద్రబాబు పాలన కూడా అంత గొప్పగా లేదు కాబట్టి వైసీపీ నేతల ఆరోపణలను జనం కూడా మెచ్చారు.

 

కానీ ఇక ఇప్పుడా సమయం దాటి పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోయాక కూడా ఇంకా చంద్రబాబునే తిడుతూ కూర్చుంటే జనం మెచ్చరు. ఆయన బాగా పాలన చేయలేదనే కదా మీ చేతికి పగ్గాలు ఇచ్చింది అంటారు. అందుకే ఇక చంద్రబాబు పాలనను తిట్టడం వైసీపీ నేతలు ఆపేయడం బెటర్. ఇక ఇప్పటి నుంచి వైఎస్ జగన్ పాలనలో జరిగిన మంచి గురించి ప్రచారం చేసుకోడవం వైసీపీ నేతలకు మేలు చేసే అంశం.

 

జగన్ అధికారంలోకి వచ్చాక తండ్రి తరహాలోనే సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. వాటి గురించి వైసీపీ నేతలు జనంలోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలి. ఆ సంక్షేమ పథకాలు అట్టడుగు పేదలకు నిజంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి. అందకపోతే లోటు పాటు ఎక్కడున్నాయో చూసుకోవాలి. అలా కాకుండా అధికారంలోకి వచ్చి 9 ఏళ్లయినా సరే ఇంకా చంద్రబాబునే తిడతామంటే జనం మెచ్చరన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: