``మీరు చేసే పనులకు మేం చప్పట్లు కొట్టాలా?. ఇలాంటి అడ్డగోలు పనులు చేస్తే ప్రజాప్రతినిధులుగా మేం చట్టసభల్లో సమర్ధించాలా?. ఇలాంటి ప్రయత్నాలను చేతనైనంత స్థాయిలో వ్యతిరేకిస్తాం. మేం సామాజికంగా బలహీనులం కావచ్చు. కానీ మాకున్న స్థాయిలో గట్టిగానే వ్యతిరేకించగలం. `` ఇవి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్య‌లు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయాల్సిందే అని కోరుతూ ఏపీ ప్ర‌తిప‌క్ష నారా చంద్ర‌బాబు నాయుడుపై ధ‌ర్మాన విరుచుకుప‌డ్డారు.

 

శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మాన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ``సీఎం ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేస్తున్నాను. కొన్ని స్వార్థ పూరితమైన ప్రయోజనాల కోసం పని చేసిన శక్తులు ఎప్పుడైనా కడవరకు కూడా పోరాడుతూనే ఉంటాయి. అందులో సంపదను పెంచుకోవాలని, తనకు తన చుట్టూ ఉన్న వారికి మేలు జరుగాలని, ఆస్తుల విలువ పెరగాలని, సంపద పెరగాలని కుత్సిత బుద్ధితో చేసిన అమరావతి రాజధాని అనే బిజినెస్‌ మోడల్‌ సాధించుకోవాల్సిన ప్రయత్నాలను మనం గమనించినప్పుడు తప్పనిసరిగా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అది కొద్ది మంది ప్రయోజనమే తప్ప..విశాలమైన ప్రజల ప్రయోజనాలకు సంబంధించినది కాదని అందరికీ అర్థమైంది.  ఇన్నాళ్లుగా పోరాటం జరుగుతున్నట్లు ప్రతిపక్షం చిత్రీకరించే వ్యక్తుల్లో ఒక్కరైనా నీతిమంతులు ఉన్నారా? అంతా కూడా అయోమయానికి గురి చేస్తున్నారు. విశాల ప్రయోజనాలు ఉన్నాయని ఎవరూ చెప్పలేకపోతున్నారు. గడిచిన కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి అవతవకలకు పాల్పడి, తన సంపాదనను పెంచుకోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు, రాష్ట్రమంతా పర్యటిస్తాం..ప్రజలను ఒప్పిస్తామనడం హాస్యాస్పదం.`` అంటూ ధ‌ర్మాన ఎద్దేవా చేశారు.

 


చంద్రబాబు అమరావతి కోసమే యాత్రలు చేస్తున్నానని చెబితే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ధ‌ర్మాన వ్యాఖ్యానించారు ``చంద్ర‌బాబు...ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటున్నారా? రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ప్రజలు నమ్ముతున్నారు. అమరావతి బార్డర్స్‌ చుట్టూ ఉన్న భూముల విలువ పెంచడానికి, చంద్రబాబు సృష్టించిన 8 నగరాల విలువ పెంచడానికే. హైదరాబాద్‌ను 70 ఏళ్లు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసినట్లుగానే అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టి అక్కడి భూముల విలువ పెంచడమే. ఇదే కదా మనం మోసపోయామని రాష్ట్ర విభజన సమయంలో సాధారణ పౌరుడు ఆందోళన చెందింది. కేంద్రం ఇచ్చిన నిధులు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు హైదరాబాద్‌లో పెట్టి గొప్పగా నిర్మాణం చేశాం. ఆ ప్రాంత వాసులకే చెందాలని వారు ఒకరకమైన భావన చెలరేగడమే 2014లో వచ్చిన ఉద్యమం. ఆ ఫలితమే రాష్ట్ర విభజన జరిగింది. ఇంత అనుభవం ఉన్నా తరువాత కూడా మళ్లీ ఇలాంటి మోసం ద్వారా ఆస్తులు పెంచుకోవాలని చంద్రబాబు దుర్మార్గంగా  ఆలోచన చేస్తున్నారు. దీని కోసం చంద్రబాబు ఊరువాడా తిరుగుతానంటే ఇంతకంటే అన్యాయం మరెక్కడ ఉంటుంది?`` అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

 

త‌మ అందరి ఆవేదన ఏంటనేది తెలుసుకోవాల‌ని ధ‌ర్మాన పేర్కొన్నారు. ``80 ఏళ్ల కాలంలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయినా పూర్తి కాలేదే?. ఈ ఆవేదన, కన్నీరు ఎవరు తుడుస్తారు. ఎన్నిసార్లు చట్టసభల్లో మాట్లాడాలి? వంశధార ప్రాజెక్టు అంటే ఇప్పుడు చెబుతున్నది కాదు. నేరెడు వద్ద బ్యారేజ్‌ పూర్తి అయి, రిజర్వాయర్‌ కంప్లైట్‌ అయి, లెప్ట్‌, రైట్‌ కెనాల్స్‌ కాంక్రీట్‌ పూర్తి అయితే  వంశధార ప్రాజెక్టు పూర్తి స్వరూపం అయినట్లు. ఈ ప్రాజెక్టు రూ.2 వేల కోట్ల విలువ చేస్తుంది. ఇది ప్రభుత్వాలకు కష్టమైతే ..లక్షల కోట్లు తీసుకెళ్లే మీ ఆస్తుల విలువ పెంచుకుంటారా?  స్వార్థపూరితమైన ఆలోచనతో వెంపర్లాడుతున్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా అమరావతి రైతులు చనిపోయారని చెబుతున్నారు. అమరావతిలో రైతులు ఎక్కడ ఉన్నారు. భూములన్నీ స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి మాటలు చెప్పి మిగతా వారిని మోసం చేయడం సరికాదు. మాకు కూడా సోషల్‌ మీడియా ఉంది. మా ఆవేదన కూడా వివరించగలం`` అని ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: