రిలయన్స్...భారతదేశానికి చెందిన వ్యాపారదిగ్గజం. భారతీయుల సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న దేశీయ కంపెనీ. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ తన సంస్థలను ఊహించని స్థితికి తీసుకువెళ్లారు. ఆయన తర్వాత కుమారులు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అయితే, ధీరుభాయ్ పెద్ద కుమారుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీది మాత్రం భిన్నమైన వ్యక్తిత్వం. తాజాగా ఆయన తమ వ్యాపారం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. 

 


మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్లతో కలిసి పాల్గొన్న ఒక కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ...ప్రపంచ దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌..వచ్చే దశాబ్దకాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించనున్నదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్దగా అవతరించడంలో ఎలాంటి అనుమానాలు లేవని, అయితే ఐదేళ్లు లేదా పదేళ్లు పట్టవచ్చు కానీ, ఈ లక్ష్యానికి చేరుకోవడం తథ్యం అని ముకేశ్‌ అన్నారు. గతేడాదికిగాను భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థను దాటేసిన  భారత్‌..అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తర్వాత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

 

భారత్‌ ప్రీమియం డిజిటల్‌ సొసైటీగా అవతరించే దశలో ఉన్నదని తెలిపారు.  మొబైల్‌ నెట్‌వర్క్‌ విపరీతంగా పెరుగడంతోపాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరిస్తుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా భారత్‌లో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలు భారీగా విస్తరిస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో భారత్‌ ప్రీమియం డిజిటల్‌ సొసైటీగా మారబోతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఇక తన సంస్థ గురించి ముఖేష్ అంబానీ వివరిస్తూ..తన తండ్రి ధీరుభాయ్‌ అంబానీ 50 ఏళ్ల క్రితం రూ.1,000 మూలధనంతో రిలయన్స్‌ను ప్రారంభించారని తెలిపారు. ప్రారంభంలో చిన్న స్థాయి సంస్థగా ఆరంభమైన రిలయన్స్‌.. ఆ తర్వాతి క్రమంలో చిన్న స్థాయి నుంచి అతిపెద్ద సంస్థగా అవతరించిందని తెలిపారు.
+

మరింత సమాచారం తెలుసుకోండి: