అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ భారత్ లో రెండు రోజుల పర్యటన తనకు జీవితాంతం గుర్తుంటుందని చెప్పారు. భారత్ బ్రహ్మాండమైన దేశమని గతంలో కంటే ఇప్పుడు మరింతగా భారత ప్రజలు తమను ఇష్టపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. భారత్ కు మరిన్ని ఆయుధాలు అమ్మేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత్ తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 
 
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని తాము అంతమొందించామని ... ఉగ్రవాదంపై తాను పోరాడినంతగా మరెవరూ పోరాడలేదని ట్రంప్ పేర్కొన్నారు. అమాయకపు ప్రజలను చంపితే తాము ఊరుకోబోమని... ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై అందరూ మరింత పోరాటం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 
 
భారతదేశానికి తాలిబన్లతో శాంతి ఒప్పందం ప్రయోజనకరమని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తాలిబన్లతో శాంతి ఒప్పందం గురించి తాను చర్చించారని తెలిపారు. పాక్ భారత్ ప్రధానులతో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పారు. భారత్ పాక్ దేశాలకు కశ్మీర్ అంశం ముల్లులాంటిదని తాను ఇరు దేశాధినేతలతో ఈ విషయాల గురించి చర్చించడానికి సిద్ధమని అన్నారు. ఆ తరువాత భారత్ తో వాణిజ్యం గురించి ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. 
 
భారతీయ మార్కెట్ చాలా విసృతమైనదని ఎంతో పెద్దదని ట్రంప్ అన్నారు. భారతీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. భారత్ వైఖరి టారిఫ్ ల విషయంలో అలాగే ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు భారత్ తో ఒప్పందం అంటే ఎక్కువ మొత్తంలో టారిఫ్ లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. హెచ్ 1బీ వీసాల విషయంలో మాత్రం ట్రంప్ సమాధానాన్ని దాటవేశారు. విలేకరులు వివిధ అంశాల గురించి అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: