దారుణంగా ఓడిపోయి 9 నెలలు కూడా కాకమునుపే ఏపీలోని ప్రతిపక్షాలు తొడలుగొట్టడం మొదలుపెట్టేశాయి. అబ్బో జగన్ ప్రభుత్వం మీద ఫుల్ వ్యతిరేకిత వచ్చేసింది, ఇక తమదే హవా అంటూ 23 సీట్లు వచ్చిన టీడీపీ, ఒక సీటు వచ్చిన జనసేనలు ఓ రచ్చ చేసేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేస్తాం అంటూ హడావిడి చేస్తున్నాయి. అటు నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జగన్ ప్రభుత్వం మీద ఒంటికాలి మీద లేచిపోతున్నాయి. ఇక బాబుతో చేరి సి‌పి‌ఐ చేసే రచ్చ మామూలుది కాదు.

 

అసలు మొన్న ఎన్నికల్లో వచ్చిన సీట్లు బట్టి చూస్తే, రాష్ట్రంలో వైసీపీకే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 151 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి స్థానికంలో దాదాపు 80 శాతం వరకు స్థానాలని దక్కించుకుంటుంది. ఆ తర్వాత టీడీపీకి కాస్త అవకాశం ఉంది. ఇక జనసేన గోదావరి జిల్లాలో ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాకపోతే మూడు రాజధానుల వల్ల కొన్ని జిల్లాల్లో వైసీపీకి అనుకూల వాతావరణం లేదు. అదే సమయంలో తాజాగా పెన్షన్, రేషన్ కార్డుల ఇష్యూ కాస్త ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.

 

అయితే ఏదో కాస్త వ్యతిరేకిత ఉన్న దాన్ని ఉపయోగించుకోవాల్సింది టీడీపీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలా లేవు. ఓ వైపు జనసేన-బీజేపీలు జతకట్టి ముందుకెళుతున్నాయి. అటు కాంగ్రెస్‌కు వచ్చిన కొత్త అధ్యక్షుడు శైలజానాథ్ కనుమరుగైపోయిన కాంగ్రెస్ కేడర్‌ని తట్టి లేపుతున్నారు. ఇక కమ్యూనిస్టుల్లో సి‌పి‌ఐ బాబుని పట్టుకుని ఏదొక లాభం పొందాలని చూస్తుంటే, సి‌పి‌ఎం ఒంటరిగా ముందుకెళుతుంది.

 

ఇక్కడ మిగిలిన పక్షాలని వదిలేసిన టీడీపీ-జనసేనలు వేరు వేరుగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటింగ్ చీలిపోయి అసలకే మోసం వస్తుంది. జగన్‌కే మంచి జరుగుతుంది. వీరి హడావిడిలో స్థానిక సంస్థల్లో జగనే క్లీన్ స్వీప్ చేసేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: