తాను శవమై.. మరొకరికి వశమై.. తనువు పుండై.. మరొకరికి పండై.. ఇదీ వేశ్యల జీవితాల గురించి తెలంగాణ కవి అనిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత్వం.. నిజమే.. వాళ్లు నడిచే శవాలుగానే ఉంటారు. తనువంతా పుండుగా మారినా మరొకరికి పండులా పండుగ చేస్తారు. మరి అలాంటి వారి జీవితాల్లో వెలుగులు ఉంటాయా.. వారి నుంచి సుఖానుభాతి కోరే వారే తప్ప వారి జీవితాల్లో చీకటిని చూసే వారు ఉంటారా.. ?

 

వేశ్యల కడుపున పుట్టిన బిడ్డల సంగతేంటి.. సమాజంలో వారి స్థానం ఏంటి.. తల్లి చేపట్టిన వృత్తి నీడలు ఆ బిడ్డల భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియంది కాదు. అందుకే అలాంటి వేశ్యల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముంబైలోని క్రాంతి అనే స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. ప్రత్యేకించి వేశ్యల కూతుళ్లను ఆ వృత్తిలోకి వెళ్లకుండా కాపాడుతోంది. వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పని చేస్తోంది.

 

ముంబైలోని కుర్లాలో ఈ క్రాంతి సంస్థ ఉంది. ఏ సమయంలో అయినా ఏ వేశ్యావాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు. తల దాచుకోవచ్చు. అలా వేశ్యావాటికల నుంచి వచ్చిన వేశ్యల కూతుళ్లు ఇక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వేశ్యల కూతుళ్లయిన ఆడపిల్లల బాల్యం భయానకంగా ఉంటుంది. నాన్న ఎవరో నాకు తెలియదు.. ఇంటికి ఎవరెవరో వస్తుంటారు. చివరకు పిల్లలమైన తమను కూడా నీ రేటెంత అని అడుగుతారు.

 

అందుకే ఈ క్రాంతి సంస్థ.. తమ వద్దకు వచ్చిన ఆడపిల్లలకు చదువు కోసం ఏకంగా స్కూల్ స్థాపించారు. ఒక్కో అమ్మాయిని బట్టి ఆమెకు అవసరమయ్యే క్లాసులను డిజైన్‌ చేస్తున్నారు. వారికి నచ్చిన అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. సక్సెస్‌కు నిజమైన అర్థం ఏమిటో చెబుతున్నారు. ఈ క్రాంతిలో చేరిన ఆడపిల్లల్లో ఒక అమ్మాయి జుంబా డాన్సర్‌ అయ్యింది. మరో అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఒక అమ్మాయి ఫ్లయిట్‌ అటెండెంట్‌ కావాలనుకుంటోంది. కేవలం చదువుకే కాదు.. అనేక కళల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. నిజంగా ఈ అమ్మాయిలు.. బురదలో విరిసిన కలువపూలు.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: