భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆరు, ఏడు నెలల్లో ఇది సాకారమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేకంగా సమావేశమైన ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తానే గెలుస్తానన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఒకవేళ తాను గెలవకపోతే మార్కెట్లు కుప్పకూలడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మోడీని మరోసారి కొనియాడారు.

 

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో భారత పారిశ్రామిక దిగ్గజాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌, ఆదిత్య బిర్లాగ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా  సహా పలువురు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

భారత్‌లో అద్బుతమైన స్వాగతం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్న ట్రంప్.. ఈ దేశంతో వాణిజ్య ఒప్పందం మరో అడుగు దూరంలో ఉందన్నారు. ఆరు, ఏడు నెలల్లో ఇది సాకారమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తానే గెలుస్తానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడం వల్లే సంస్కరణలు ఊపందుకున్నాయన్నారు ట్రంప్. మూడేళ్లకాలంలో తాను చేపట్టిన అనేక పనులు మళ్లీ తనను గెలిపిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఒబామా కేర్‌ను మించిన హెల్త్ కేర్ పాలసీ తీసుకొచ్చామన్నారు.

 

అమెరికాలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా భారత పారిశ్రామిక వేత్తలను ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత సురక్షిత దేశం అమెరికానే అన్నారు ట్రంప్. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అమెరికాలో పూర్తిగా సంసిద్ధమైందని చెప్పారు. ఈ విషయంపై చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో మాట్లాడానన్నారు. భారత ప్రధాని మోదీపై ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ చాలా స్పెషల్ అన్న ట్రంప్.. తాను చేసే దానిపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుందన్నారు. ఎంత మంచివాడో అంతటి ఘటికుడన్నారు. భారత పారిశ్రామిక వేత్తలతో గంటకు పైగా సమావేశమైన ట్రంప్.. వారడిగిన అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానమిచ్చారు. ప్రపంచంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్న భారత పారిశ్రామికవేత్తలను అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: