తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల కేటాయింపుల్లో సమస్యలను తీర్చేందుకు కృష్ణా రివర్ బోర్డు రంగంలోకి  దిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల  చేసే నీటిని చెరిసగం వాడుకోవాలని తెలంగాణ రాసిన లేఖతో పర్యటన చేపట్టారు బోర్డు సభ్యులు. తాగునీటి సరఫరాకు నీటి విడుదలతో పాటూ, టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపై కూడా బోర్డు అధ్యయనం చేయనుంది.

 

కృష్ణానదీ యాజమాన్య బోర్డు తన పరిధిలోని వివిధ ప్రాజెక్టులను పరిశీలించాలని నిర్ణయించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సంబంధించి  ఈ నెల 27 వరకు నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను పరిశీలించనుంది. బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌, సభ్యకార్యదర్శి పరమేశం, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు అశోక్‌కుమార్‌, శివశంకరయ్యలతో కూడిన బృందం ప్రాజెక్టులను పరిశీలించనుంది.

 

విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల చేసిన నీటిని చెరి సగం వంతున పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా నది యాజామాన్య బోర్డుకు లేఖ రాసింది. పొతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం భారీగా నీటిని తరలించిందని ఫిర్యాదు చేశారు. ఈ నీటినంతా నికర జలాల కోటా పరిధిలో లెక్కించాలని డిమాండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఏపీ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. ఈ నీటిని వరద ప్రవాహం కింద పరిగణించాలని కోరుతున్నది. దీంతో విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను సందర్శించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.

 

పోతిరెడ్డిపాడుతో పాటు.. శ్రీశైలం ప్రాజెక్టును బోర్డు ఛైర్మన్, సభ్యులు సందర్శించనున్నారు.  పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటిని విడుదల చేసే శ్రీశైలం కుడిగట్టు కాలువపై ఏర్పాటు చేసిన టెలిమెట్రీ, చెన్నై తాగునీటి సరఫరాకు నీటి విడుదల తీరు తదితర అంశాలపై కూడా బృందం దృష్టి పెట్టనుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటివాటాల కేటాయింపుల్లో సమస్యలకు చెక్ పెట్టేందుకు కృష్ణా రివర్ బోర్డ్ ఎంట్రీ ఇచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: