కార్మికుల పొట్టకొట్టిన  అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ సర్కారు వార్నింగ్ ఇచ్చేసింది. వాళ్లను శిక్షించి తీరతామని తేల్చి చెప్పేసింది. గత ఐదు సంవత్సరాల్లో కార్మిక శాఖ గాడి తప్పిందని, కార్మిక శాఖను ప్రక్షాళన చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడిందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. 

 

ఈ స్కామ్‌లో గతంలో కార్మిక శాఖ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ప్రమేయం ఆధారాలతో సహా బయటపడిందని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. దోషులకు శిక్ష తప్పదన్నారు. కార్మిక శాఖ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయం తెలిపారు. 

 

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్మిక శాఖ అధికారులతో 16 అంశాలపై చర్చించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని, ఆ దిశగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని కార్మిక శాఖ మంత్రి జయరాం చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ఇందుకు దోహదపడుతుందన్నారు. పిల్లలను పనికి కాదు.. బడికి పంపించాలని సీఎం వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారన్నారు. 

 

చిన్నారులను బడికి పంపించే తల్లుల బ్యాంకు అకౌంట్లలో రూ. 15 వేలు జమ చేశారన్నారు. అక్కాచెల్లెమ్మలు కూడా వారి బిడ్డలను చదివించుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 2 వేల మంది బాల కార్మికులు ఉన్నారని అధికారులు చెప్పారని, వచ్చే జూన్‌ మాసం వరకు బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: