దేశ రాజధాని లో శాంతి భద్రతలు  అదుపు తప్పాయి . సీ ఏ ఏ అనుకూల , వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 13  మంది మృతి చెందగా , 150 మంది గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు . ఈశాన్య ఢిల్లీ లో పరిస్థితులు అదుపు తప్పడం తో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి . నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు . కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేశారు . ఢిల్లీ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యం లో పాఠశాలకు సెలవులు ప్రకటించడమే కాకుండా ,  సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేశారు .

 

ఈశాన్య ఢిల్లీ , తూర్పు ఢిల్లీ పరిధిలో 86 పరీక్షా కేంద్రాల్లో జరగాల్సిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష , 12 వ తరగతి వెబ్ అప్లికేషన్ పరీక్ష ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు . ఢిల్లీ అల్లర్లు ప్రేరేపిత హింసాత్మక ఘటనలుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు . సీ ఏ ఏ కు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే కొంతమంది అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు . ఇక ఒక చేతిలో జాతీయ జెండా , మరొక చేతిలో రాళ్లు పట్టుకోవడం చూస్తే  అది  ఏ రకమైన ఉద్యమమో స్పష్టమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు .

 

ఢిల్లీలో అల్లర్లకు పాల్పడిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టేది లేదని అన్నారు . సీ ఏ ఏ వల్ల మైనార్టీలకు ఎటువంటి నష్టం లేదని పేర్కొన్న ఆయన రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు . అదే సమయం లో వందమంది ఒవైసీ లు వచ్చినా, సీ ఏ ఏ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: