కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. వైసీపీలో రాజ్యసభ సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. నాలుగు సీట్ల కోసం  పదుల సంఖ్యలో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ మాత్రం ఏడుగురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఎన్డీఏ సర్కారులో చేరితే నాలుగు సీట్లలో ఒకటి బీజేపీకి కేటాయించాలి. అప్పుడు ఈ ఏడుగురిలో ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కనుంది. 
 
ఏపీలో నలుగురు సభ్యుల పదవీకాలం ముగియడంతో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకే ఈ స్థానాలకు గెలుచుకోవడానికి అవకాశాలున్నాయి. ప్రభుత్వం శాసనమండలి రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించటంతో మండలి రద్దు కానుంది. ఎన్నికల ముందు మండలిలో స్థానం దక్కుతుందని ఆశించిన వారంతా ఇప్పుడు నిరాశలో ఉన్నారు. 
 
మండలిలో స్థానాలను ఆశించిన నేతలు రాజ్యసభ సీట కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ వైసీపీ ఇప్పటికే ఏడుగురి పేర్లు ఖరారు చేసిందని వీరికి మాత్రమే అవకాశం కల్పించనుందని తెలియడంతో వారు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతానికి వైవీ సుబ్బారెడ్డి, చిరంజీవి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, అయోధ్యరామిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా వీరిలో నలుగురికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. 
 
మరోవైపు వైసీపీ ఎన్డీఏలో చేరితే ఇద్దరు వైసీపీ ఎంపీలకు కేంద్ర కేబినేట్ లో చోటు ఇచ్చి ఒక రాజ్యసభ సీటు తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. వైసీపీ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడుతున్న చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా వైసీపీలో తీవ్ర పోటీ నెలకొనడంతో  చాన్స్  దక్కడం కష్టమే అని ప్రచారం జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, వైవీ సుబ్బారెడ్డిలకు ఖచ్చితంగా చాన్స్ దక్కనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: