దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 18కు చేరింది. ఈశాన్య ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతోంది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నాలుగు ప్రాంతాలలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అధికారులు కనిపిస్తే కాలిచేత ఉత్తర్వులు జారీ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
ఢిల్లీకి ఇతర ప్రాంతాల నుండి ఉన్న సరిహద్దులను అధికారులు బారికేడ్లతో మూసివేశారు. కేంద్ర హోం శాఖ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్వయంగా రంగంలోని దిగి నిన్న అర్ధరాత్రి సీలంపూర్ లో పర్యటించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు సెంటర్లలో సీ.బీ.ఎస్.ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ ఘర్షణల్లో 150మందికి పైగా గాయపడ్డారు. 
 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కూడా ఆందోళనకారులు నిరసన తెలియజేశారు. పోలీసులు రంగంలోకి దిగి వాటర్ క్యానర్ ను ప్రయోగించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఘర్షణల్లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 56 మంది పోలీసులు గాయపడ్డారు. అధికారులు అల్లర్ల వలన భారీగా ఆస్తి నష్టం సంభవించిందని చెబుతున్నారు. అల్లర్లపై ఢిల్లీలో కేంద్ర కేబినేట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. 
 
మొదట మౌజాబాద్ చౌక్, జాఫ్రాబాద్ లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రస్తుతం ఢిల్లీలో ప్రశాంత వాతావరణమే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈశాన్య ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలో జరిగిన హింసాత్మక సంఘటనల గురించి విచారణను కోరుతూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఈరోజు విచారణ జరగనుంది. అల్లరి మూకలు విధ్వంసం సృష్టించి హింసకు పాల్పడిన చాంద్ బాగ్, భజన్ పూర్ ప్రాంతాలలో "కనిపిస్తే కాల్చివేత" ఉత్తర్వులతో ప్రశాంతత నెలకొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: